స్వచ్ఛ భారత్’ కు స్ఫూర్తి బాపూ జీ. ఆ కలను సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్‌లో ప్రారంభించిన స్వచ్ఛభారత్ మిషన్‌కు జాతిపిత గాంధీజీ 150 వ జయంతి సందర్భంలో భారత దేశాన్ని సంపూర్ణ స్వచ్ఛతను సాధించాలని సంకల్పించారు. ఈ స్వచ్ఛ భారత్‌ను సంత్ గాడ్గే మహరాజ్ అనే అసామాన్యుడు వందేళ్ళ క్రితమే (1907) కలగన్నాడు. గాడ్గే బాబాగా పిలవబడే ఆయన దేశం గర్వించదగ్గ 19వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్త. గాడ్గే బాబా మహా రాష్ట్రలో అమరావతి జిల్లాలోని షేన్ గావ్‌లో 1876, ఫిబ్రవరి 23న సక్కుబాయి, జింగ్రాజీలకు జన్మించారు. గాడ్గే బాబా పూర్తి పేరు దేబూజీ దింగ్రాజీ జనార్కర్.
‘దేబూజీ అంటే మరాఠీలో మట్టిచిప్ప. చేతిలో చీపురు, తలపై మట్టి చిప్ప ఒంటిపై రంగురంగుల గుడ్డ పేలికలతో కూడిన దుస్తులు ధరించడం ఇతని ఆహార్యం. చీపురుపట్టి చిద్విలాసంగా ఫోటోలకు పోజులివ్వడం తెలియదు. కానీ చీపురుతో వీధులను శుభ్రం చేయడంలో భాగంగా చీపురును తన ఆహార్యంలో భాగంచేసుకుని దానితోనే సహవాసం చేశారు. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ -గాడ్గే బాబాను తన గురువుగా ప్రకటించుకున్నారు. అంబేద్కర్ వివక్షతో కూడుకున్న హిందూ మతం విడి మతం మార్చుకుందామని భావిస్తున్న సమయంలో తాను అభిమానించే గాడ్గే బాబాను సలహా కోరారు. గాడ్గే బాబా భావాలకు దగ్గర ఉన్న సమతా, మమతా, కరుణ, ప్రేమ అనే హేతుబద్ధమైన మానవ విలువలతో కూడిన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు.
జ్యోతిరావు ఫూలే అతని సంఘసేవను చూసి అభినందించారు. గాడ్గే బాబా తన 33వ ఏట భార్యా పిల్లలను వదిలి దేశాటనకు బయలుదేరి సంచార సాధువుగా మారారు. ఏ ఊరు కెళ్ళినా మొదటగా చేసేది వీధులు ఊడ్చటం, దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం ఆయన విధి. మూఢ నమ్మకాలు పాటించ వద్దనీ, సాటి మనిషిని కులం పేరిట చిన్నచూపు చూడవద్దని బోధించారు. కుల, మత భేదం లేకుండా మనషులందరూ సమానమన్న ఆయన మాటలు, చేతల్లోని నిజాయితీ జనాలను కట్టిపడేసింది. అనాధాశ్రమాలు, పాఠశాలలు, వసతి గృహాలు ధర్మ శాలలు ఇలా మొత్తం 150 నిర్మాణాలను ప్రజల సహకారంతో పూర్తి చేశాడు. మహా రాష్ట్రకు సోషలిస్టు భావాల వేదికగా చేసింది గాడ్గే బాబానే అని ప్రముఖ మరాఠా రచయిత ఆత్రే ప్రశంసించారు.
ఆ రోజుల్లో మట్టిపనో, కుమ్మరి పనో చేసి రెండు రొట్టెలు సంపాదించి ఆరగించేవాడు.పాడుబడ్డ గోడల మాటునో, దేవాలయంలోనో తలదాచుకునేవాడు. రోడ్డు మీద తిని, రోడ్ల పక్కనే జీవించి, చివరికి రోడ్డు పక్కనే 1956, డిసెంబర్ 20 న గాడ్గే బాబా తనువు చాలించారు. అంతటి అతి సామాన్యమైన వ్యక్తి ఆనాటి కుల రహిత సమాజాన్ని నిర్మించాడు. స్వచ్ఛ భారత్‌ను ఆనాడే కలగన్న మహనీయుడు ఆయన. గాడ్గే బాబాను జ్ఞాపికగా మహారాష్ట్రలోని అమరావతిలో ‘సెయింట్ గాడ్గే బాబా యూనివర్సిటీ’ ని 1983లో స్థాపించారు. గాడ్గే చూపిన బాటను మన పాలకులు, ప్రజలు అనుసరిస్తే సంపూర్ణ స్వచ్ఛ భారత్ కల సాకారమవుతుందని ఆశిద్దాం. జీవితాంతం సంస్కరణల కోసం కృషి చేసిన గాడ్గే బాబా డిసెంబర్ 20, 1950న పరమపదించాడు. సమానత్వం, సోదర భావం, మానవత్వం చాటిన గొప్ప వ్యక్తి. ఇదే మనం ఆయనకు అర్పించే ఘన నివాళి.
గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409