Monday, December 23, 2024

గడ్కరీ ఉవాచ!

- Advertisement -
- Advertisement -

Russia Ukraine War live updates రాజకీయ నాయకుల అభిప్రాయాల వెనుక విచిత్రమైన వ్యూహాలుంటాయి. ఒకే పార్టీకి చెందిన అగ్ర నేతలిద్దరూ ఒకే విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చడం, విరుద్ధ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ లేని భారతాన్ని (కాంగ్రెస్ ముక్త్ భారత్) చూడాలని ప్రధాని మోడీ కలగంటూ వుంటే ఆ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలని, జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షంగా వేళ్లూనుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఏమనాలి? దేశ పాలక పార్టీలోని ఇద్దరు అగ్రనేతలు ఒకే విషయంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు? ప్రధాని మోడీ అయితే కాంగ్రెస్ పార్టీని భ్రష్ట వారసత్వ రాజకీయాల శిధిల భవనంగా నిందిస్తూ పలుసార్లు, పలు విధాలుగా దాని పతనాన్ని కోరుతూ మాట్లాడారు.

ఇప్పటికీ అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంటారు. స్వాతంత్య్రానంతర భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంటే మోడీకి బొత్తిగా గిట్టదు. ఆయన అలా కాంగ్రెస్‌ను ఉన్నపళంగా భూస్థాపితం చేయాలని కోరుకుంటూ వుంటే గడ్కరీ అందుకు భిన్నంగా మాట్లాడారు. పుణెలో ‘లోక్‌మత్ ’ పత్రిక జర్నలిజం అవార్డుల ప్రదాన సభకు ఇటీవల హాజరైన గడ్కరీ ప్రజాస్వామ్యమనే బండి పాలక, ప్రతిపక్షాలనే రెండు చక్రాల మీద నడుస్తుందని, బలమైన ప్రతిపక్షం అవసరం కూడా వుందని అన్నారు. అందుచేత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకోవాలని తాను హృదయపూర్వకంగా భావిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ఆయన ఇంకో మాట కూడా అన్నారు.

కాంగ్రెస్ బలహీనపడుతూ వుంటే దాని స్థానాన్ని ప్రాంతీయ పక్షాలు ఆక్రమించుకుంటున్నాయని ఇది దేశానికి మంచి చేయదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. గడ్కరీ వ్యాఖ్యలో కాంగ్రెస్ మీద ప్రేమ కంటే ప్రాంతీయ పక్షాలు బలపడడం పట్ల అసహనం, అసంతృప్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై ఖాళీ చేస్తున్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయగలుగుతుండడం గడ్కరీకి తేళ్లు, జెర్రులూ పాకుతున్న చందంగా వున్నట్టుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాధించిన వంటి దిగ్విజయాలు గడ్కరీకి వెరపు కలిగిస్తున్నట్టుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్, తమిళనాడులో డిఎంకె, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీహార్‌లో ఆర్‌జెడి, యుపిలో సమాజ్ వాదీ పార్టీ వంటి ఘనతర చరిత్ర కలిగిన ప్రాంతీయ పక్షాలు బిజెపికి సవాలుగా మారిన వాస్తవాన్ని గడ్కరీ జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. దేశాన్ని చిరకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, దాని స్థానంలో జాతీయ స్థాయిలో వివిధ పార్టీల ఫ్రంట్‌లు పరిపాలన సాగించిన సందర్భాలున్నాయి. అలాగే 1967లో రాష్ట్రాల్లో భారతీయ క్రాంతి దళ్, సంయుక్త సోషలిస్టు పార్టీ, ప్రజాసోషలిస్టు పార్టీ, జనసంఘ్‌లు కలిసి కాంగ్రెస్‌ను ఓడించి సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఉదాహరణలున్నాయి.

అందుచేత గట్టి ప్రతిపక్షంగా గాని, పాలక పార్టీగా గాని ఎదగగల అర్హత ఒక్క కాంగ్రెస్ పార్టీకే వుందని గడ్కరీ భావించడం విస్మయాన్ని కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం ఎంతైనా వుందనడంతో ఎవరికీ ఎటువంటి పేచీ వుండనక్కర లేదు. కాని భారతీయ జనతా పార్టీ తన నిరంకుశ విధానాలతో, నడవడికతో పలు అంశాలపై, ప్రజా సమస్యలపై వివరమైన చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రశ్నను పబ్లిగ్గా ఉరి తీస్తూ అదే సమయంలో ప్రజల చేత మతతత్వ భంగును తాగిస్తున్నంత కాలం ప్రత్యామ్నాయ శక్తులు బలపడే అవకాశం అంతగా వుండదు. ప్రజలు కళ్లు తెరిచి, మెదళ్లను సానబట్టి మంచి చెడులను నిష్పాక్షికంగా విడదీసి చూసి హేతుబుద్ధితో ఆలోచించే అవకాశం ఇచ్చినప్పుడే వారు నాణేనికి రెండో వైపున ఏమున్నదో చూడగలుగుతారు. చదువులో కూడా మౌఢ్యాన్ని దట్టంగా చొప్పించి యువత ఆలోచనలను మతతత్వ, మతోన్మత్త బురదలో పొర్లేటట్టు చేస్తున్న చోట అభివృద్ధి పడక మంచమెక్కుతుంది.

గడ్కరీ ప్రాంతీయ పార్టీల కంటే కాంగ్రెస్ బలపడడమే మంచిదని ఎందుకంటున్నారు? ఇటీవల టిఆర్‌ఎస్ వంటి పార్టీల నేతలు కాంగ్రెస్, బిజెపిలు రెండూ దేశాన్ని అవినీతి, అసమర్థతల జమిలి అవలక్షణాల పుట్టగా మార్చివేశాయని, దేశం బాగు పడాలంటే సమూల మార్పును తీసుకు రావలసి వుందని గొంతెత్తి చాటారు. ఇది గడ్కరీ వంటి నేతలను గంగవెర్రులెత్తించి వుండవచ్చు. దేశంలో అపారమైన వనరులున్నాయని వాటిని పూర్తిగా వినియోగించుకొని సమర్థవంతంగా పని చేస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చునని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకటికి రెండుసార్లు దృఢంగా ప్రకటించారు. అటువంటి సదాశయాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడితే భారతీయ జనతా పార్టీకి నూకలు కరువవుతాయని గ్రహించే గడ్కరీ ప్రాంతీయ పార్టీలు బలపడడం తనకు ఇష్టం లేదని అన్నారు. అయితే వర్తమానం తమ చేతుల్లో వుందని గర్వపడే మోడీ, గడ్కరీ వంటి నేతల అదుపులో భవిష్యత్తు మాత్రం వుండబోదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News