స్టేషన్ల మధ్య ఆర్‌యూబీ నిర్మాణం
హైదరాబాద్: లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రత పెంపులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన నెట్‌వర్క్ పరిధిలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించిన నేపథ్యంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకొని కాపలా లెవల్ క్రాసింగ్ (ఎల్‌సీ) గేట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తోంది. ఇందులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ అనేక కఠిన సవాళ్లను అధిగమిస్తూ సికింద్రాబాద్ టు డోన్ సెక్షన్‌లో గద్వాల్ టు శ్రీరామ్‌నగర్ స్టేషన్ల మధ్య ఉన్న 97ఈ లెవల్ క్రాసింగ్ గేటును విజయవంతంగా తొలగించి ఆర్‌యూబీ నిర్మాణాన్ని అధికారులు పూర్తిచేశారు.
రెండు కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ డివిజన్ ఇప్పటివరకు రెండు కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్‌లను తొలగించింది. గద్వాల టు శ్రీరామ్‌నగర్ స్టేషన్ల మధ్య ఉన్న ఎల్‌సీ గేటు కృష్ణ నదికి అతి సమీపంలో ఉన్నందున అనేక సవాళ్లు ఎదురైనా వాటిని దక్షిణ మధ్య రైల్వే బృందం వాటిని సమర్థవంతంగా పరిష్కరించింది. ఎల్‌సీ గేట్ స్థానంలో ఆర్‌యూబీ నిర్మాణాన్ని కచ్చితమైన ప్రణాళికతో పూర్తి చేసింది. కావలసిన భద్రతా చర్యలను చేపడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆర్‌యూబీ నిర్మాణంలో ముఖ్యాంశాలు :
ఎల్‌సీ గేటు 2.5 డిగ్రీల వంపుతో ఉంది. దానికి అనుగుణంగా, గిర్డర్‌పై ఉడన్ స్లీపర్లు వేశారు. ఈ నేపథ్యంలో లోతుగా తవ్వకం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కృష్ణా నదికి సమీపంలో ఉండడంతో, నీటి మట్టం ఎల్లప్పుడు భూగర్భ స్థాయికి సమానంగా ఉండడంతో నిరంతరం నీటి తొలగింపు చర్యలు చేపట్టారు. రైల్వే సరిహద్దు పక్కనే ఉన్న పొలాల్లో సంవత్సరం పొడవునా (ఏప్రిల్ టు జూలై మినహా) పంటలు సాగు చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకొని ఈ సమయాల్లో పనులు చేపట్టారు. భారీ వర్షాలు కురిసినా పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మరింత భద్రత కోసం అదనంగా, మూడు రౌండ్లలో టై ట్యాంపింగ్ మిషన్ ద్వారా ట్యాంపింగ్ పనులు చేశారు.
సిబ్బందిని అభినందించిన జిఎం
ఆర్‌యూబీ నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో పాలుపంచుకున్న హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. క్లిష్టమైన ప్రాంతంలో ప్రతికూల వాతావరణంలో కూడా రైళ్ల రాకపో కలకు ఎక్కువ అంతరాయం కలగకుండా కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యంత సమర్థవంతంగా విజయవంతంగా పనులు పూర్తి చేయడంపై ఆయన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.