Friday, November 22, 2024

మేయర్, డిప్యూటీ మేయర్ రెండూ టిఆర్‌ఎస్‌వే

- Advertisement -
- Advertisement -

గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టిఆర్‌ఎస్
వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కెసిఆర్
అధికార పార్టీకి మద్దతు తెలిపిన ఎంఐఎం

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను తిరిగి దక్కించుకుంది. ఈ స్థానాలకు మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తుందని అంతా భావించారు. అయితే వాటిని కైవసం చేసుకునేంత సంఖ్య బలం లేకపోవడంతో మజ్లిస్‌కు లేకపోవడంతో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు తెలిపింది. ఈ రెండు పదవులను కైవసం చేసుకునేందుకు సిఎం కెసిఆర్ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో మజ్లిస్ పార్టీ కూడా విధిలేని పరిస్థితుల్లో అధికార పార్టీకే జైకొట్టాల్సి వచ్చింది. కాగా, బల్దియా కౌన్సిల్‌లో తగు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బిజెపి ఎన్నికల బరిలో నిలిచింది. అయితే మజ్లిస్, టిఆర్‌ఎస్ పార్టీల సంఖ్యాబలం 3/4 వంతు ఉండడంతో అధికార పార్టీ అతి సునాయసంగా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో బిజెపి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆ రెండు పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టిఆర్‌ఎస్ పార్టీ విధేయులనే వరించింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మినీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు.

అలాగే, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా, మోతెశ్రీలతరెడ్డి తార్నాక నుంచి మొదటిసారిగా గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మేయర్ పీఠం కోసం తొలినుంచి అధికార టిఆర్‌ఎస్‌లో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్)తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కెసిఆర్ చివరి నిమిషంలో కెకె కుమార్తెను ఖరారు చేశారు. అయితే విజయారెడ్డి సైతం మేయర్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ సిఎం కెసిఆర్ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. కాగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పార్టీ టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. కాగా బిజెపి నుంచి ఆర్‌కెపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టిఆర్‌ఎస్‌కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జైశ్రీరాం అంటూ బిజెపి సభ్యులు నినాదాలు చేశారు.

ఇద్దరు మహిళలే కావడం సంతోషంగా ఉంది: ఎంఎల్‌సి కవిత
జిహెచ్‌ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఇద్దరు మహిళలు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సికవిత అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆమె మాట్లాడుతూ, ఇద్దరు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎన్నక కావడం శుభపరిణామమని అన్నారు. కౌన్సిల్ మంచిగా నడవడం, హైదరాబాద్ అభివృద్ధిలో మహిళల పాత్ర ఉంటుందని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ మహిళల పక్షపాతి అని మరొకసారి రుజువైందన్నారు. ఎంఐఎం మద్దతు ఇవ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం దాటవేశారు.

Gadwal Vijayalakshmi Elected as GHMC Mayor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News