Sunday, January 19, 2025

భువి నుంచి దివికి విహారం..

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : నింగిలోకి మనిషి పర్యాటక యాత్ర గగన్‌యాన్ తొలి ఘట్టం చేపట్టారు . విజయాల ప్రతిష్టతల భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీడి1) పరీక్ష శనివారం తొలి జాప్యం తరువాత విజయవంతం అయింది. వాహకనౌక పరీక్షను శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ద్వారా నిర్ణీత రీతిలో నింగిలోకి దూసుకువెళ్లేలా చేశారు. ముందు ఉదయం 8 గంటల తరువాత ఈ ప్రయోగం ఖరారు చేశారు. పర్యవేక్షక లోపాలు వంటి కొన్ని సాంకేతిక సమస్యలు , వాతావరణ ప్రతికూలతలు తలెత్తడంతో, వాటిని సరిదిద్ది రెండుగంటల తరువాత ఈ రాకెట్ ద్వారా పేలోడ్స్ నింగిలోకి ఎగిశాయి.

మానవ సహిత గగన్‌యాన్ చేపట్టినప్పుడు వాహకనౌకకు ఏదైనా ముప్పు వాటిల్లితే అందులోని వ్యోమగాములు సురక్షితంగా క్రూ మాడ్యూల్ ద్వారా నిర్ణీత సముద్ర ఉపరితల స్థావరంపై దిగడం ఈ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ ఉద్ధేశం. దీనినే క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సిఇఎస్) లేదా ఆపదలో తప్పించుకునే విధానంగా పిలుస్తారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇది అత్యంత కీలక ఘట్టం. సింగిల్ ఇంజిన్ రాకెటు నింగిలోకి వెళ్లి నిర్ణీత దూరం ప్రయాణించిన తరువాత వాహకనౌక లోని క్రూ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది. తరువాత సురక్షితంగా పారాచూట్ల సాయంతో బంగళాఖాతం సముద్ర ఉపరితలంపై వాలింది. ఇటువంటి ఎస్కేప్ సిస్టం పరీక్షలు మరికొన్ని నిర్వహించిన తరువాతనే అసలుసిసలు కీలక గగన్‌యాన్ ఆరంభమవుతుంది.

చాలా కీలక వ్యవస్థలకు సంక్లిష్ట సంకేతాలు
గగన్‌యాన్ అబార్ట్ మిషన్ ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు అద్దం పట్టింది. రాకెట్ నింగిలోకి వెళ్లిన తరువాత ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతం పంపించారు. వెంటనే రాకెట్ పై భాగంలో ఉన్న క్రూ ఎస్కేప్ వ్యవస్థ సంబంధిత ఇంధన మోటార్లు మండటం జరిగింది. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ రాకెట్ నుంచి వేరుపడింది. ఆ తరువాత 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ వేరయ్యాయి. తరువాత అందుబాటులోని డ్రోగ్ ప్యారాచూట్లు తెరుచుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలోకి దిగింది. ఈ యావత్తూ ఘట్టాన్ని అత్యంత కీలకమైన కెమెరాల సాయంతో చిత్రీకరించారు.
వ్యోమగాముల భద్రత కీలకం
పరీక్ష విజయవంతం ః ఇస్రో సోమనాథ్
గగన్‌యాన్ సంబంధిత టీవీ డి1 పరీక్ష విజయవంతం అయింది. ఇందుకు తోటి సైంటిస్టులను అభినందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆ తరువాత విలేకరులతో స్పందించారు. వ్యోమగాముల అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఈ గగన్‌యాన్‌లో వారి భద్రత కీలకం. ఇందుకు తగు విధమైన ఎస్కేప్ సిస్టం సామర్థతను ఇప్పుడు పరీక్షించామని , ఇది విజయవంతం అయిందని వెల్లడించారు. తొలుత తలెత్తిన సాంకేతిక క్లిష్టతలను సరిదిద్ది తరువాత రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహించినట్లు , ఇది చక్కగా పనిచేయడం గగన్‌యాన్‌లో తొలివిజయం అని ఇస్రో సారథి ఆనందం వ్యక్తం చేశారు.

2025లో గగన్‌యాన్‌లో ముగ్గురు ప్రయాణికులు
ఇప్పటి అంచనాల మేరకు గగన్‌యాన్ 2025 సంవత్సరంలో జరుగుతుంది. నిజానికి ఇది వాణిజ్యపరమైన అంతరిక్ష పర్యాటక యాత్రగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ముందుగా ముందుకొచ్చే ముగ్గురు వారిని ఎంచుకుని వారికి వ్యోమగాములుగా తగు తర్ఫీదు ఇస్తారు. తరువాత వారిని గగన్‌యాన్ వాహకనౌక ద్వారా భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి తీసుకువెళ్లడం ఇస్రో ఆధ్వర్యపు గగన్‌యాన్ ప్రాజెక్టు లక్షం . అంతరిక్ష వాతావరణంలో వ్యోమగాములు మూడు రోజుల పాటు పరిభ్రమిస్తూ విహరిస్తారు. తరువాత వీరిని తగు విధంగా సురక్షితంగా భూమిపైకి సముద్ర మార్గం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. గగన్‌యాన్‌కు సంబంధించి అంతర్భాగంగా ఉండే పలు అంశాలపై ఇస్రో చాలా ఏండ్లుగా అధ్యయనాలు చేస్తూ వస్తోంది. ఇంతవరకూ డెస్క్ వరకూ పరిమితం అయిన పరీక్షలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. టీవీ డి1 పరీక్ష ఇందులో మొదటిదని ఇస్రో వర్గాలు తెలిపాయి. టీవీ డి 1 పరీక్షలో మూడు ఘట్టాలు ఇమిడి ఉన్నాయి. 1 క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత పరీక్ష, 2 క్రూ మాడ్యూల్ పనితీరు పరిశీలన. 3 వ్యోమనౌకను క్షేమంగా కిందికి తీసుకువచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టత పరిశీలన , ఈ మూడింటిని ఇప్పటి సన్నాహక పరీక్షలో గమనించారు. ఇక సముద్ర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చడం మరో ఘట్టం. ఇక వ్యోమగాములు వాహకనౌక నుంచి అత్యవసరంగా విడిపోయే దశలో అన్ని ప్రక్రియలు సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. చురుగ్గా ఉండాలి. మెరుపు వేగంతో సెకన్ల వ్యవధిలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో సాగాలి. ఈ దిశలోనే క్రూ ఎస్కేప్ సిస్టమ్ కోసం అవసరం అయిన అధునాతన క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్లను ఇస్రో రూపొందించింది. ఇవి చాలా వేగంగా మండుతాయి. అంతర్గతంగా అత్యధిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీని ద్వారా క్రూ ఎస్కేప్ సరిగ్గా పనిచేస్తుంది. మొత్తం ఐదు రకాల రాకెట్ మోటార్లు ఇందులో ఉండటం ప్రధాన విషయం. శనివారం నాటి అబార్ట్ మిషన్ విజయవంతానికి శాస్త్రజ్ఞులు పూర్తిస్థాయి సమన్వయంతో వ్యవహరించారు.

క్రూ మాడ్యూల్ (సిఎం)లో ప్రత్యేక వాతావరణం
గగన్‌యాన్ దశలో చాలారోజుల ముందునుంచే వ్యోమగాములను క్రూ మాడ్యూల్‌లో ఉంచుతారు. ఇందులో ఒత్తిడితో కూడిన భూ వాతావరణం వంటి పరిస్థితి ఉంటుంది. ఇది సాధారణంగా సిఎంలకు ఉండే పద్ధతి. అయితే ఇస్రో తలపెట్టిన టీవీ డి1లోని సిఎం ఇందుకు విరుద్ధంగా అన్‌ప్రెషరైజ్డ్ తరహాలో ఉంటుంది. గగన్‌యాన్ ప్రాజెక్టు దశలో యాత్రపూర్తి తరువాత బంగళాఖాతంలో దిగే వ్యోమగాములను తరువాత చెన్నైలోని మిషన్ కంట్రోలు రూంకు తీసుకువెళ్లడంతో గగన్‌యాన్ ప్రాజెక్టులోని యాత్రా ఘట్టం పూర్తవుతుంది.
రాకెట్ దూసుకువెళ్లే 4 సెకండ్ల ముందు స్టాప్ సిగ్నల్
శనివారం నాటి సాంకేతిక సమస్యల గురించి ఆ తరువాత ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ విలేకరులకు తెలిపారు. సింగిల్ స్టేజ్ ఇంజిన్ వినువీధిలోకి దూసుకువెళ్లడానికి అవసరం అయిన ప్రక్రియకు కేవలం 4 సెకండ్ల ముందు అక్కడి తెరపై హోల్డ్ సంకేతాలు వెలువడ్డాయి. ఇది ప్రయోగం నిలిపివేత ఆదేశాలకు సంబంధించింది. వెంటనే దీనిపై ఆటోమొటిక్ లాంచ్ సీక్వెన్స్ కంప్యూటర్ స్పందించింది. లోపాన్ని కనుగొంది. దీనిని సెకండ్ల వ్యవధిలోనే సరిదిద్దడంతో ప్రయోగం అనుకున్న విధంగా జరిగిందని సోమనాథ్ తెలిపారు. అత్యవసర రీతిలో సర్దుబాట్ల తరువాత ఈ 34. 9 మీటర్ల పొడవైన టీవీ డి1 ప్రయోగం జరిగింది. ఇప్పటి ప్రయోగం విజయవంతం కావడం పట్ల మిషన్ నిర్వాహకులు ఆర్ హట్టన్ హర్షం వ్యక్తం చేశారు. క్రూ మాడ్యూల్ సిస్టమ్‌ను ఇప్పటి ప్రయోగానికి ముందు దేశంలోని పలు ఇస్రో కేంద్రాలలో పరీక్షించారు. తరువాత శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రానికి అనుసంధానం చేశారు.

మనిషి గగనయాత్ర ఘనత చేరువలో భారత్
టీవీ డి1 పరీక్ష విజయవంతంపై ప్రధాని మోడీ
త్వరలోనే గగనంలోకి మనిషిని తీసుకువెళ్లే ఉజ్వల ఘట్టానికి భారతదేశం మరింత చేరువైందని ప్రధాని మోడీ స్పందించారు. శనివారం ఇస్రో తలపెట్టిన అబార్ట్ మిషన్ విజయవంతం కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సిబ్బందిని అభినందిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. భారత కలలు మరింత సాకారం అయ్యే దిశలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. పలు విజయాల ఇస్రోకు మరో అభినందన అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News