నిజాంపేట: భక్తుల కొంగు బంగారంగా పేరోందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధిలోని గాజులరామారం గ్రామంలో వెలసిన శ్రీ చిత్తారమ్మ దేవి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం అమ్మవారికి గవ్యాంత పూజలు, మూల మంత్ర జపము, అవాహియ, దేవతాహోమాలు, పూర్ణాహుతి, బలి ప్రధానం , ఋత్విక్ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్యగౌడ్ మాట్లాడుతూ ఈ నెల 24న ఆదివారం అమ్మవారి ప్రధాన జాతర మహోత్సం జరుగుతుందన్నారు. ఉదయం 3 గంటలకు అభిషేకం, 4 గంటలకు విజయ దర్శనం, అనంతరం తలంబ్రాలతో (ఒడి బియ్యం) అమ్మవారికి పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఉదయం 11 గంటలకు అమ్మవారి బోనాలు, మధ్యాహ్నం 3 గంటలకు పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఉరేగింపు, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 9 గంటలకు బుర్రకథ, వినోద ప్రదర్శనలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 25వ తేదిన ఉదయం 11 గంటలకు రంగం దివ్యావాణి, సాయంత్రం ఉచిత ప్రదర్శన, 26, 27, 28 తేదిలలో అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయని తెలిపారు. 29న అన్నదాన కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.