న్యూస్‌డెస్క్: గనుల కుబేరుడు గాలి జనార్దన రెడ్డి ఏర్పాటు చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కెఆర్‌పిపి) పార్టీ వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలో గాలి కొత్త పార్టీ వల్ల తమ పార్టీ ఓట్లకు గండిపడుతుందని బిజెపిలోని కొందరు సీనియర్లు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
అయితే కాంగ్రెస్‌లో మాత్రం గాలి జనార్దన రెడ్డి పార్టీ వల్ల బిజెపి అనుకూల ఓట్లు చీలిపోయి తమ అభ్యర్థుల గెలుపునకు మార్గం సుగమం అవుతుందని ధీమా వ్యక్తమవుతోంది. 2008 కర్నాటక ఎన్నికల్లో బిఎస్ యడియూరప్ప నాయకత్వంలో బిజెపి అధికారంలోకి రావడంలో గాలి సోదరులు కీలక పాత్ర పోషించారు. మెజారిటీ దక్కించుకునేందుకు బిజెపి చేపట్టిన ఆపరేషన్ కమలంలో గాలి జనార్దన రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. కాగా..గనుల కుంభకోణంలో లోకాయుక్త జరిపిన విచారణతో మంత్రిపదవి కోల్పోయి ఆయన జైలుపాలయ్యారు. అప్పటి కేంద్ర మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌తోపాటు బిజెపి కూడా ఆయనను దూరంపెట్టింది.
అయితే ఆయన మిత్రుడు శ్రీరాములు మాత్రం బిజెపి పంచన చేరిపోయారు. బిజెపిలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ నెరవేరకపోవడంతో చివరకు సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు గాలి ప్రకటించారు. బీదర్, యాద్‌గిర్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పల్, విజయనగర జిల్లాలలో బిజెపి విజయావకాశాలను గాలి కొత్త పార్టీ దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
పైగా..కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే కలబురగికి చెందిన వ్యక్తి కావడమే కాక ఆయన దళిత నాయకుడు కావడం కూడా కాంగ్రెస్‌కు కలసివచ్చే అంశం.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తామని హిందూ మహాసభ, శ్రీరామ సేన ఇదివరకే ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు అధికార బిజెపికి సవాలుగానే పరిణమించే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.