కాషాయ కండువా కప్పుకున్న గాలి దంపతులు
బెంగళూరు: గనుల దిగ్గజం, కర్నాటక రాజ్య ప్రగతి పక్ష(కెఆర్‌పిపి) ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి సోమవారం తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు. కర్నాటక మాజీ మూఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో గాలి జానార్దన రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య అరుణ లక్ష్మి కూడా బిజెపిలో చేరారు. బిజెపిలో తన పార్టీని విలీనం చేసి తాను ఆ పార్టీలో చేరడం సంతోషం ఉందని జనార్దన రెడ్డి తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండా తాను బిజెపిలో చేరానని, తనకు ఎటువంటి పదవులు అవసరం లేదని ఆయన తెలిపారు.
జనార్దన రెడ్డి చేరికపై యడియూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయమని, తమ పార్టీని మరింత బలోపేతం చేస్తుందని యడియూరప్ప అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనార్దన రెడ్డి, ఆయన భార్య, మిత్రులు బిజెపిలో చేరడం తమ పార్టీ బలం పెంచుతుందని ఆయన తెలిపారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు గాలి జనార్దన రెడ్డి కెఆర్‌పిపిని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆయన గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన సోదరులు జి కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి బిజెపి అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలవ్వడం గమనార్హం. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి, జైలు పాలవ్వడానికి ముందు ఆయన కర్నాటకలో యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 26, మే 7న పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఓట్ల లెక్పింపు జరగనున్నది.