Sunday, December 22, 2024

బళ్లారిలో అన్నదమ్ముల సవాల్..

- Advertisement -
- Advertisement -

బళ్లారి: తన సోదరుడు గాలి జనార్దన రెడ్డి సొంత పార్టీ పెట్టడం ముమ్మాటికి తప్పని, ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధమని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ప్రకటించారు. సొంత పార్టీ పెట్టవద్దని తన సోదరుడికి(జనార్దన రెడ్డి) సలహా ఇచ్చానని, ఆయన సొంత పార్టీతోనే ముందుకు సాగుతానంటే తాను మాత్రం ఏం చేయగలనని ఆదివారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సోమశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి టిక్కెట్‌పైనే బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనార్దన రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తే ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధమేనని ఆయన తేల్చిచెప్పారు.

అధికార బిజెపిని తాను వీడే ప్రసక్తి లేదని సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి బి శ్రీరాములుతో కలసి తాను బిజెపిలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. జనార్దన రెడ్డికి నచ్చచెప్పడానికి తాను ప్రయత్నిస్తున్నానని, కాని ఆయన మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని సోమశేఖర్ వివరించారు. రాజకీయాలలో ఉన్నపుడు ఓపిక అవసరమని, కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేసి జనార్దన రెడ్డి వంద శాతం తప్పు చేశారని సోమశేఖర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుందని, అయితే తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో తటస్తంగా ఉండే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.

తన సోదరుడు జనార్దన రెడ్డి జైలులో ఉన్నందు వల్ల న్యాయపరమైన విషయాలు చూసుకునేందుకు తాను 2013లో ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆయన తెలిపారు. గనుల కుబేరుడు గాలి జనార్దన రెడ్డి ఇటీవల కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష(కెఆర్‌పిపి) పేరిట కొత్త పార్టీని స్థాపిస్తుట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్-కర్నాటక ప్రాంతంలో అధికార బిజెపి విజయావకాశాలపై గాలి జనార్దన రెడ్డి పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News