Wednesday, March 26, 2025

గాలిబ్ గీతాలు దాశరథి ఇష్టానుసరణాలు

- Advertisement -
- Advertisement -

ఎడ్వర్డు ఫిడ్జెరాల్డు అనువాదంతో ఉమర్ ఖయాం రుబాయీలకు అంతర్జాతీయం గా ఎంతటి ప్రాచుర్యం లభించిందో దాశరథి అనువాదంతో మిర్జా గాలిబ్ షేర్‌లకు తెలుగులో
అంతటి ప్రాచుర్యం లభించింది. ఉమర్ ఖయాం రుబాయీలకు తెలుగులో అనేక అనువాదాలు వచ్చాయి. ఫిడ్జెరాల్డు నుంచి చేసిన వాళ్ళున్నారు. నేరుగా పర్షియన్ నుంచి చేసిన వాళ్ళున్నారు. మిర్జా గాలిబ్ షేర్‌లను దాశరథి నేరుగా ఉర్దూ నుంచి చేశారు. బెజవాడ గోపాలరెడ్డి కూడా చేశారు కానీ ఆయన పుస్తకం ప్రాచుర్యం పొందలేదు.
దాదాపుగా ఇది కవి దాశరథి శతజయంతి సంవత్సరం. ఆయనకు అనన్యమైన కీర్తిని సమకూర్చిన గాలిబ్ గీతాలు పుస్తకం సుమారు అయిదేళ్ల క్రితం షష్టిపూర్తి చేసుకుంది. గాలిబ్ గీతాలు 12వ ముద్రణ ప్రస్తుతం మార్కెట్లో ఉంది. దాశరథి రచనల్లో ఇన్ని ముద్రణలు పొందిన పుస్తకం మరొకటి వుండక పోవచ్చు.
ఉర్దూ తెలియని తెలుగు పాఠకులను ఈ పుస్తకం విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగులో గాలిబ్ గీతాలు పుస్తకం విశేష ఆదరణ పొందటానికి కారణాలు అనేకం.
ప్రగతిశీల భావజాలానికీ -గాలిబ్ కవిత్వానికీ మధ్య సంబంధం లేదని చాలామంది నమ్మకం. అయితే ఇది గాలిబ్ కవిత్వం చదివి స్థిరపరచుకు న్న అభిప్రాయం కాదు. ముస్లిం సమాజం గురించీ, ముస్లిం సంస్కృతి గురించీ ప్రచారంలో ఉన్న కట్టుకథలు, పుక్కిటి పురాణాల ప్రభావం కారణం. గజల్స్, ఖవ్వాలీలు సుఖభోగాలలో మునిగితేలే సముదాయాలకు సంబంధించిన సాంస్కృతిక, వినోద కార్యకలాపాలుగా సినిమాలు తదితర
వ్యాపార వినోద సాధనాలు బాగా ప్రచారం చేశాయి. దాశరథి గాలిబ్ గీతాలు పుస్తకం పాపుల ర్ కావడానికి బాపు బొమ్మలు కూడా ఒక కారణం. కవర్ పేజీ నుంచి ఆఖరి పేజీ వరకూ గాలిబ్‌ని ఒక శృంగార కవిగా తెలుగు పాఠక ప్రపంచానికి ఈ పుస్తకం పరిచయం చేసింది.
తెలుగు అనువాదంలో మిర్జా గాలిబ్ కవిత్వానికి జరిగిన న్యాయాన్యాయాలను గురించి పరిశీలించటానికి ముందు గాలిబ్ గురించి కనీసమైన అవగాహన చాలా అవసరం.
గాలిబ్ ఎవరు? ఈ శీర్షికతో ఉర్దూలో పుస్తకాలు ఉన్నాయి. తన గజల్స్‌లో గాలిబ్ స్వయంగా కూడా ఈ ప్రశ్న అనేకసార్లు వేసుకున్నాడు.
దాశరథి భాషలో చెప్పాలంటే…
‘గాలిబెవ్వడంచు’ కాంత ప్రశ్నించిన నేమి
ఉత్తరమ్ము నీయవలయు?’
తన గురించి, తన సాహిత్యం గురించీ ఎప్పుడైనా సరే నేరుగా తనతో చర్చించవచ్చని పాఠకులకు భరోసా ఇచ్చాడు.
‘నన్ను కరుణించి పిలువు మేనాడు గాని
కాను గతమును, తిరిగి రాగలను నేను’.
(మెహరుబా హోకె బులాలో ముఝె చాహో జిస్ వఖ్త్/మై గయా వఖ్త్ నహీ హూ ఫిర్ ఆ భీ న సకూ)’ –
మరో గజల్‌లో –
‘న గులె నగ్మ హు, న పర్దయె సాజ్
మై హూ అప్నీ షికస్త్ కీ ఆవాజ్..’
దాశరధి భాషలో –
‘వీణమెట్టు గాను, విరుల నవ్వును గాను
నా పరాజయ ప్రణాదమేను..’
అవును, గాలిబ్‌ది ఒక పరాజితుని స్వరం..
ఒక క్షతగాత్రుని ఆర్తనాదం గాలిబ్ కవిత్వం.
గాలిబ్‌ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రముఖ మార్క్సిస్టు సిద్ధాంతకర్త ఎజాజ్ అహమద్ ఒక పదబంధం ఉపయోగించాడు. గాలిబ్ వాక్యాలు – Intense moral loneliness – సాంద్రతరమైన ఒక నైతిక ఏకాకితనం నుంచి వచ్చాయని అన్నాడు. అవును, ఒక బోదలేర్, ఒక మలార్మే, ఒక రింబో, ఒక టి.ఎస్. ఎలియట్, ఒక సిల్వియా ప్లాత్ వంటి కవుల వాక్యాల్లో కూడా గాఢమైన, నిగూఢమైన ఈ నైతిక ఏకాకితనం గోచరిస్తుంది.
మై అందలీబే గుల్షనే నా ఆఫరీదా హూ –
ఇంకా ఉనికిలోకి రాని పువ్వులతోట పని నేను – అని చెప్పుకున్నాడు.
అతి సున్నితమైన, మృదువైన మానవోద్వేగాల నుంచి అతి గంభీరమైన అండ పిండ బ్రహ్మాండాల వంటి అంశాల వరకు, సృష్టి, ప్రకృతి, మానవ
జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి తనదై న ప్రత్యేక పధ్ధతిలో ప్రతిస్పందించాడు గాలిబ్.
జీవితపు వ్యర్థత గురించి, బుద్బుధప్రాయత గురించి ఇంత బలంగా చెప్పిన కవి భారతీయ సాహిత్యంలోనే మరొకరు లేరనటం అతిశయోక్తి కాదు. నిరంతరం మనిషిని నీడలా వెంటాడే ఒక మహా నిరాశను తన సహజమైన పారిహాసిక పరిభాష ద్వారా నీరాజనం పట్టిన కవి గాలిబ్.
మిర్జా గాలిబ్ ఒక అసాధారణమైన కవి.
తన కాలంలో బహుళ ప్రయోగంలో ఉన్న రూపకాలు, ఉపమల వ్యవస్థను తల్లక్రిందులు చేశా డు. వాటిని తిరిగి అనూహ్యమైన అర్థాలతో నింపి పాఠకులను విచకితుల్ని చేయగల శక్తి, భాషను ధ్వంసం చేయటం ద్వారా భాషకు ప్రాణం పోయగల శక్తి అసాధారణమైన కవులకు మాత్రమే ఉంటుంది.
ఉదాహరణకు –
‘హయ్ తమాషా గాహె సోజే తాజా హర్ యక్ ఉజ్వెతన్/జూ చరాగానే దివాలీ సఫ్ బ సఫ్ జల్తా హూ మై.’
దీపావళి అంటే దీపాల పండుగ. ఆహ్లాదకరమైన వెలుగుల వేడుక. బారులుగా పేర్చిన దివ్వెలలా నిలువునా ధగ్ధమై పోతున్నానని చెప్పడం గాలిబ్ వంటి ఒక అసాధారణమైన కవికే సాధ్యం.
అంతేకాదు. విధాత లేదా దేవుని అస్తిత్వాన్ని అసాధారణమైన కవులు మాత్రమే ప్రశ్నించగలరు. దేవుని అస్తిత్వానికి ముప్పుతెచ్చే మౌలికమైన ప్రశ్నలు వేయగలరు. అటువంటి అనేక ప్రశ్నల్ని పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో సంధించిన కవి. పరమేశ్వరుని ఉనికితో పరాచికం ఆడగల ప్రజ్ఞ
‚కలిగిన కవి మిర్జా గాలిబ్.
“స్వర్గమును గూర్చి నాకు సర్వమ్ము తెలియు
మనసు సంతస పడుటకు మంచి ఊహ!”
(హమ్ కో మాలూమ్ హయ్ జన్నత్‌కీ హఖీఖత్ లైకిన్/
దిల్ కో ఖుష్ రఖ్నే కె లియే గాలిబ్ ఎ ఖయాల్ అచ్ఛా హయ్..)
గాలిబ్ రొమాంటిక్ కవిత్వం రాశాడు. నిజమే. సందేహం లేదు. అయితే, అవి కేవలం రొమాంటిక్ కవితలు మాత్రమే కాదు. అందీ అందని మానవ జీవిత పరమార్ధాలను ఆవిష్కరించేందుకు గాలిబ్ చేసిన రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలలో భాగంగా వచ్చిన కవితా ఖండికలవి.
“ఈ యజాండమ్ము నందు నశించునన్ని
గాలిలో దీపమట్లుండెగాదె రవియు!”
సూర్యుణ్ని గాలిలో దీపం అనటం ఎంత గొప్ప ఊహ!
అతి సాధారణమైన విషయాలు చెబుతూనే ఉన్నట్టుండి అసాధారణమైన అంశాన్ని ఆవిష్కరించటం గాలిబ్ ప్రత్యేకత.
“కాలమేల నన్ను కడు నిర్దయత్వాన
చెరపివేయు, భక్తవరద! నేడు?
పుడమి పలక మీద పొడమిన అధికాక్ష
రమును గాను నేను రాచివేయ”
(యా రబ్ జమాన ముఝ్ కో మిటాతా హయ్ కిస్ లియే / లూహే జహా పె
హర్ఫె ముకర్రర్ నహీ హు మై).‘
హయ్ కహాఁ తమన్నా కా దూసరా
ఖదమ్ యా రబ్?
హమ్ నె దశ్తే ఇమ్కా కో ఇక్
నక్షె పా పాయా..
“ఒక పదచిహ్న సమానం కదా విశ్వమనే
ఈ ఎడారి సమస్తం
మానవ ఆకాంక్ష రెండో పాదం మోపటానికి, దేవా, ఎక్కడుంది అవకాశం?”
ఇక మనం గాలిబ్ గీతాలు పుస్తకం విషయానికి వద్దాం.
దాశరథి గాలిబ్ గీతాలు అనువాదం ఎలా సాగిందో పరిశీలించడానికి ముందు తన అనువాద రీతిని గురించి స్వయంగా దాశరథి ఏం చెప్పారో చూద్దాం.
‘అయః పేటికలలో భద్రపరచబడిన మణిని సాధించటం ఎంత కష్టమో పద్యాలలో దాగిన గాలిబు హృదయాన్ని అందుకోవడం కూడా అంత శ్రమతో కూడిన పని. ప్రతి పద్యాన్ని ఆకళించుకొని, ఆ పద్యానికి వివిధ వ్యాఖ్యాతలు, విమర్శకులు చెప్పిన అర్ధాన్ని చదివి నాకు స్ఫురించిన అర్థాన్ని జీర్ణించుకుని, త్రేన్చి తెలుగు రూపంలో మళ్లీ హృదయాన్ని ఆవిష్కరించటం కొంత క్లిష్టమైన పనే. ఒక్కొక్క పద్యాన్ని తెలుగులోకి దింపడానికి రోజులు పట్టేవి. అప్పటికీ సంపూర్ణంగా మూలార్ధం రాకుంటే మళ్లీ మార్చవలసి వచ్చేది. ఇది అనువాదం కాని అనుసరణ కాదు. కనుక నా కల్పన ఈ షణ్మాత్రమూ పనికి రాదు. తెలుగు పాఠకులకు గాలిబు భావం అందడానికి కావలసిన హంగులు చేయడానికి మాత్రమే నాకు అధికారం ఉంది. అంతకుమించి లేదు. ఇలాంటి నిర్బంధాలతో ఈ అనువాదానికి ఉపక్రమించాను. బాగా జనాదరాన్ని పొందిన పద్యాలు ఇంచుమించు అన్నీ తీసుకున్నాను. క్లుప్తత (brevity) చెడకుండా రెండు పాదాలలోని భావాన్ని రెండు పాదాలలోనే చాలా ఇమిడ్చినాను. ఎక్కడో మరీ వివరణ అవసరమైన చోట నాలుగు పాదాలుగా పెంచాను. అనువాదానికి ఆటవెలది, తేటగీతి వాడుకున్నాను. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ద్విపదను, రగడను ఉపయోగించినాను. మూలాని కి నా అనువాదం ఎంత సన్నిహితంగా ఉన్నదో మచ్చుకి ఇక్కడ చూపిస్తాను’ – అంటూ దాశరథి కొన్ని ఉదాహరణలు చూపించారు.
ఆయన పాఠకుల ముందు పెట్టిన మొదటి ఉదాహరణ:
ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట దుష్కరము సుమ్ము!
దీనికి మూలం –
“బస్ కె దుష్వార్ హయ్ హర్ కామ్ కా ఆసా హోనా /
ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సా హోనా..”
ఆద్మీ అనే మాటకీ, ఇన్సాన్ అనే మాటకీ ఒక చిన్న అర్థభేదం వుంటుందని హిందీ సినిమా పరిజ్ఞానం వున్న వాడికి కూడా అర్థం అవుతుంది. హిందీలో ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్ ’ అనే సినిమా కూడా ఉంది. ఆద్మీ అనే మాటను మనిషి అనే అర్థంలో, ఇన్సాన్ అనే మాటను మానవుడు, నాగరీకుడైన మానవుడు అనే విస్తృతమైన అర్థంలో ఉపయోగిస్తారు.
1954లో వచ్చిన బయోపిక్ ‘మిర్జా గాలిబ్’ సినిమా పాటగా వచ్చిన గాలిబ్ గజల్ చాలామందికి గుర్తుండే ఉంటుంది.
‘దిలె నాదా తుఝే హువా క్యా హయ్
ఆఖిర్ ఇస్ దర్ద్ కీ దవా క్యా హయ్’
ఈ పల్లవితో పాటు మధ్యలో ఉన్న మరో చరణాన్ని కూడా దాశరథి అనువదించారు.
ముందు పల్లవి వినండి.
“పిచ్చి హృదయమ! నీకేమి వచ్చెనోయి?
అసలు నీ బాధ కెయ్యది ఔషధమ్ము?”
ఇకపోతే చరణం –
నిజానికి ఇది ఎంతో అద్భుతమైన షేర్.
సృష్టి, ప్రకృతి సౌందర్య రహస్యాల్ని గురించి జిజ్ఞాస, ఉత్సుకతనీ ప్రదర్శించే వాక్యాలివి. ప్రాపంచికమైన అనుభవాల ఆధారంగా వాస్తవికతను ఉజ్వలం చేయటానికి కవి చేసిన ప్రయత్నం.
‘సబ్జ్ వొ గుల్ కహా సె ఆయే హయ్?
అబ్ క్యా చీజ్ హయ్ ! హవా
క్యా హయ్?..”
సబ్జ్ అంటే పచ్చదనం, గుల్ అంటే పూలు.
అబ్ అంటే మేఘం. హవా అంటే గాలి.
దాశరథి గారి తెలుగు అనువాదంలోకి వెళ్ళటానికి ముందు ఈ ఇంగ్లీషులో ఈ భావార్థాన్ని ఒక సారి పరిశీలించండి.
Where from have these
Flowers and greenery come?
What are these clouds all about?
What is the secret of the air?
ఇప్పుడు దాశరథి గారి అనువాదం చూద్దాం.
“ఎచ్చటి నుండి వచ్చెనీ పూలు, ఫలములు?
కారుమబ్బులేమి, గాడ్పులేమి?..”
కంపు అంటే సుగంధం. గాడ్పు అంటే గాలి అని పాండిత్యం ప్రదర్శించవచ్చు. మరి మబ్బులు కారుమబ్బులు ఎలా అయ్యాయి, ఫలములు ఎక్కడినుండి వచ్చాయి?
“కుతలమిది, పిల్లవాండ్రాడు కొనెడు చోటు
ఎవొ చమత్కారములు చూతు పవలు రేలు.”
(బాజీచయె అతఫాల్ హయ్ దునియా మెరె ఆగె
హోతా హయ్ షబో రోజ్ తమాషా మెరె ఆగె )
(The world is a children’s playground before me
Night and day, this theatre is enacted before me)
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర పోరాటానికి ముందు సంవత్సరాల్లో ఢిల్లీ ఎర్రకోటలో అనూహ్యపరిణామాలు అనేకం జరిగాయి. ఆంగ్లేయుల జోక్యం పెరిగిపోయింది. 1853లో ఆకస్మికంగా మెటకాఫ్ చనిపోయాడు. పాలన విషయంలో మొఘల్ వారసుల ఎంపిక విషయంలో ఆసక్తి కనబరచిన ఇలియట్, టామస్‌లు కూడా ఆ సమయంలోనే చనిపోయారు. నవాబ్ షంసుద్దీన్ ఖాన్ ఉరి తరువాత అతని భార్య రాకుమారుడు ఫతహుల్ ముల్క్ అర్ధాంగి అయింది. మెటకాఫ్ మరణానికి ముందే ఈ వారసుడు కూడా హఠాత్తుగా చనిపోయాడు. చక్రవర్తి భార్య జీనత్ మహల్ తన కొడుకు జవాబఖత్ పట్టాభిషేకానికి మార్గం సుగమం చేస్తున్నది. కుట్రలు, కూహకాలతో వాతావరణం వేడెక్కిఉంది. 1853 మే నెల 22 న ఢిల్లీ ఉర్దూ పత్రికలో ఈ గజల్ అచ్ఛయింది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం వున్న ఈ గజల్‌లో
అనేక గొప్ప షేర్లు ఉన్నాయి. కానీ దాశరథి
ఈ కింది షేర్‌ని మాత్రం
అనువదించారు.
‘త్రాగుశక్తి లేదు, దర్శించు
బలమున్నదింక
పానపాత్ర నెదుట నిడుము
‘శృంగారం, భోగ
విలాసాల ఇతివృత్తాలకే దాశరథి ప్రాధాన్యం ఇచ్చారు.
‘ఆమె మా ఇంటి కెట్టులో
అరుగుదెంచె దైవకృత మగునిద్ది,
సాధారణమ్మె?’
అన్నారు దాశరథి.
దీని ఉర్దూ మూలం చూడండి:
వొ ఆయె ఘర్ మె హమారె ఖుదాకి ఖుదరత్ హయ్
కభి హమ్ ఉన్ కొ కభి అప్నే ఘర్ కొ దేఖ్ తే హయ్
‘సాధారణమ్మె’ అనే మాట తప్ప రెండో పాదం ప్రసక్తే లేదు.
‘దాయమ్ పడా హువా తెరె దర్ పర్ నహీ హు మై / ఖాక్ అయిసీ జిందగీ కె పత్థర్ నహీ హు మై..’
“బాధ కలిగినప్పుడు పలవించెదను నేను
నాది హృదయము, కాదు రాయి..”
‘కాదు రాయి ‘తప్ప షేర్‌లోని మిగతా మాటల ప్రస్తావనే లేదు.
దైర్ నహీ హరమ్ నహీ దర్ నహీ ఆస్తా నహీ
బైఠె హయ్ రహెగుజర్ పె హమ్ గైర్ హమే ఉఠాయె క్యూ?
మందిరం కాదు, మసీదు కాదు, ఇంటిగుమ్మం కాదు, ఆస్థానం కాదు/రహదారి మీద కూర్చున్నా ను. ఎవరో వచ్చి నన్ను లేవమనటం ఏమిటి అని అడుగుతున్నాడు గాలిబ్.
దాశరథి అనువాదం:
“ఎవని వాకిలి కాదు, ఇల్లేని కాదు,
దారిలో కూరుచుంటి, వద్దనెదరేల?”
జబ్ కె తుజ్ బిన్ నహీ కొయి మౌజూద్
ఫిర్ ఎ హంగామయె ఖుదా క్యా హయ్?
(నువ్వు తప్ప వేరెవరూ ఉనికిలో లేనప్పుడు
దైవం గురించిన ఈ గొడవంతా దేనికి?)
దాశరథి అనువాదం:
“దైవమా నీవు కోరని వేవి లేవు
లోకమున మరి ఇట్టి కల్లోలమేల?”
ఇష్క్ పర్ జోర్ నహీ, ఎ వొ ఆతిష్ హయ్ గాలిబ్
జిస్ కొ లగాయే న లగే, జిస్ కొ బుఝాయెనా బనే
“ప్రణయ మనగ వింతవహ్ని; అంటించిన
నంట, దార్పినంత నారబోదు”
జిందగానీ పె ఏతెమాద్ గలత్
హయ్ కహాఁ ఖైసర్ ఔర్ కహాఁ ఫగఫూర్?
“బ్రతుకుపై నింత విశ్వాస పడెదరేల?
ఏడి మాంధాత? పురుకుత్సుడేడి నేడు?”
ఖైసర్ అంటే రోమన్ చక్రవర్తి సీజర్. ఫగఫూర్ అనగా చైనా చక్రవర్తి. మాంధాత, పురుకుత్సులకీ పై ఇద్దరికీ ఏమిటి పోలిక?
ఇవి రెండూ తెలుగు పాఠకులకు సులభంగా
అందుబాటులోకి వచ్చే పురాణ పాత్రలేనా?
ఈ పుస్తకంలో ఒక పద్ధతి, క్రమశిక్షణ కన్నా అస్తవ్యస్తత, ఆరాచకం అధికంగా కనిపిస్తుంది. పద
ప్రయోగం విషయంలో ఇది మరింత స్పష్టంగా గోచరిస్తుంది. పుస్తకం పేరు కూడా మనం ఒక ఉదాహరణ కింద తీసుకోవచ్చు. మొత్తం 407 షేర్లను అనువదించిన దాశరథి ఒక్క గజల్‌ని కూడా పూర్తిగా అనువదించే ప్రయత్నం చేయలేదు. మొత్తం గజల్‌ను గీతం అంటే అంగీకరించవచ్చు కానీ షేర్‌ను గీతం అనటం ఎంతవరకు సమంజసం? అలాగే ‘ఇష్క్,’ అంటే ప్రేమ. ప్రేమ అనే పదం కన్నా ప్రణయం, వలపు వంటి పదాలను ఎక్కువ సార్లు వాడారు. ‘దర్ద్’ అంటే బాధ లేదా నొప్పి. కానీ దాశరథి రుజ అనటానికి కూడా
సందేహించలేదు.
అనువాదం, మరీ ముఖ్యంగా సాహిత్య
అనువాదం, అందులోనూ కవిత్వం అనువాదం కత్తి మీద సాము.
అందులోనూ గాలిబ్ కవిత్వం అనువాదం మరింత కష్టం. చాలామంది ఉర్దూ కవులకు గాలిబ్ కవిత్వం అంతంత మాత్రంగానే తప్ప పూర్తిగా అర్ధం కాదు. అయితే, ఉన్నవాటిలో సులభమైన షేర్లనీ, బాగా ప్రాచుర్యంలో వున్న షేర్లను తాను ఎంపిక చేసుకున్నట్లు దాశరథి చెప్పుకున్నా రు. కఠినమైన షేర్ల జోలికి ఆయన వెళ్ళలేదు.
ఇకపోతే..
ఇబాదత్ ఖానా ఎ
నాకూసియాన్ అస్త్
హమానా కాబా ఎ
హిందోస్తాన్ అస్త్
(శంఖం పూరించేవాళ్ళ ప్రార్థనాగృహం కాశీ.
ఇది హిందూ దేశపు కాబా, నిస్సందేహం)
పర్షియన్ భాషలో మీర్జా గాలిబ్ కాశీ నగరం గురించి ఒక ద్విపద కావ్యం వంటిది రాశాడని తెలియక పోయినా, గాలిబ్ గీతాలు చదివిన తెలుగు పాఠకుడు గాలిబ్ గొప్ప శివభక్తుడని భావించే అవకాశం మాత్రం పుష్కలంగా వుంది.
“ఇపుడు కాశి కెట్టు లేగెద వో కవీ!
నీకు సుంత సిగ్గు లేకపోయె.”
(కాబా కిస్ మూ సె జావోగే గాలిబ్ షరమ్
తుమ్ కో నహీ ఆతీ)
“బానిసనె యయ్యు స్వాతంత్య్రపరుడ నేను,
వెడలివత్తు కాశిని గౌరవింపకున్న”
(బందగీ మే భీ వొ ఆజాద్ వొ ఖుద్ బీ హయ్ కె హమ్ ఉల్టే ఫిర్ ఆయే, దరే కాబా వా నా హుఆ)
“శివుని వెదకబోతి, చిక్కలే దాతడు
వట్టి చేతులూని వత్తునేని
జనులు నవ్వగలరు గనుక నే రా నింక,
తిరిగిరాక యెటకొ అరుగ గలను.”

“ఒంటిగా కాశికేగలేనోయి, గురువ!”
“గుడిని శివుడు దొరకకున్న కాశికిగాని
పరువులెత్తి నేను బడయగలను”
‘కాబా ‘ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ
‘కాశి’ అన్నారు తప్ప కాబా అనే పదం పుస్తక ప్రవేశం చేయకుండా దాశరథి అన్ని విధాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అలనాటి భారత రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శి, బహుభాషాకోవిదులు, కీ.శే.దేవులపల్లి రామానుజరావు ఈ పుస్తకానికి అందించిన అవతారికలో – ‘గాలిబ్ కవిత్వములోని హైందవేతర వాతావరణమును హైందవ
వాతావరణముగా పరివర్తించుటలో దాశరథి ప్రత్యేక ప్రతిభ చూపించినారు‘ అంటూ మిర్జా గాలిబ్‌ని తన అనువాదం ద్వారా దాశరథి హైందవీకరించారని ప్రశంసించారు.
గాలిబ్ గీతాలు అనువాద రీతిని గురించి
దాశరథి చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే గాలిబ్ గీతాలు దాశరథి ఇష్టానుసరణాలు తప్ప మూలానికి
విధేయమైన అనువాదాలు ఎంతమాత్రం కావు.
ఖాదర్ మొహియుద్దీన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News