న్యూఢిల్లీ : గల్వాన్ సైనిక అమరవీరుడు నాయక్ దీపక్ సింగ్ భార్య లెఫ్టినెంట్ రేఖాసింగ్ సైనికాధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2020 జూన్‌లో చైనా సైనికుల దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలోని గల్వాన్ సరిహద్దు ప్రాంతంలో నాయక్ దీపక్ సింగ్ దేశం కోసం బలి అయ్యారు. ఇప్పుడు ఆయన భార్య రేఖాసింగ్‌ను ఈ ప్రాంతంలోని యుద్ధ క్షేత్రానికి అధికారిణిగా నియమించారని అధికార వర్గాలు తెలిపాయి. నాయక్ సింగ్ ఆర్మీమెడికల్ కార్ప్‌కు చెందిన వారు. తరువాత ఆయనను బీహార్ రెజిమెంట్ 16వ బ్యాచ్‌కు బదలాయించారు.
చైనా సైనికులతో ఘర్షణల్లో వీరోచితంగా పోరాడుతూ, తోటి భారతీయ సైనికులకు వైద్య చికిత్సలు అందించడంలో కీలక పాత్ర పోషించిన నాయక్‌కు మరణానంతరం 2021లో విశిష్ట వీర్ చక్ర పురస్కారం అందింది. 29 సంవత్సరాల రేఖాను ఆమె అభిష్టం మేరకు ముందుగా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమి (ఒటిఎ)లో శిక్షణకు పంపించి తరువాత ఆమెను ఆర్మీ ఆర్డెన్నెస్ కార్ప్‌లో ఆఫీసరుగా నియమించారు. ఇప్పుడు లద్థాఖ్ సరిహద్దుల వెంబడి ఆమె తన భర్త వీరోచిత స్ఫూర్తితో విధుల్లో చేరేందుకు సిద్ధం అయి , ఆఫీసరు కేడర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఓ వీర సైనికుడి భార్య ధైర్యసాహసాల విధుల నిర్వహణకు తగు పట్టం కడుతున్నామని సైన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది.