Monday, December 23, 2024

భూభాగంపై బిజెపి వ్యూహాత్మక మౌనం!

- Advertisement -
- Advertisement -

Galwan valley history

‘భారత్ తన ప్రాంతాన్ని కోల్పోయిందనే మాటల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ముగిసిన సేనల ఉపసంహరణ’ అనే శీర్షికతో డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఒక వార్తనిచ్చింది. ఇతర పత్రికలు కూడా వేరే శీర్షికలతో ఈ వార్తను ఇచ్చాయి. లడఖ్ సరిహద్దులోని గోగ్రా హాట్‌స్ప్రింగ్స్ లేదా పెట్రోలింగ్ పాయింట్ 15(పిపి15) ప్రాంతంతో పాటు పిపి16 నుంచి రెండు వైపుల చైనా, భారత్ మిలిటరీని ఉపసంహరించుకున్నాయి. అంగీకృత ప్రాంతంలోని తాత్కాలిక కట్టడాలు, మిలిటరీ మౌలిక సదుపాయాలను తొలగించారా లేదా అని మిలిటరీ సంయుక్త బృందాలు ఈ మేరకు తనిఖీ పూర్తి చేసినట్లు వార్తలు రాగా అధికారికంగా మన దేశం నిర్ధారించలేదు.

ఒప్పందం ప్రకారం రెండు పక్షాలు ఇప్పటి వరకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి సమాన దూరం వెనక్కు తగ్గాలి. ఆ ప్రాంతాలలో మిలిటరీ ఉండకూడదు. దానికి వెలుపల ఉండవచ్చు. గతంలో గాల్వన్ లోయ నుంచి 2020 జూన్‌లో, పాంగాంగ్ సో సరస్సు ఉత్తర గట్టు నుంచి 2021 ఫిబ్రవరిలో, ఆగస్టులో గోగ్రా పోస్టు నుంచి ఉపసంహరించుకోవటంతో పాటు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి)కు ఇరువైపులా ఎలాంటి తనిఖీలు లేని ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. తాజా ఉపసంహరణ గురించి చుషుల్ నుంచి లడఖ్ స్వయంపాలిత కాండ ప్రాంతాల అభివృద్ధి మండలి (ఎల్‌ఎహెచ్‌డిసి)కి ఎన్నికైన సభ్యుడు కాంచోక్ స్టాంజిన్ అసమ్మతిని వెల్లడించారు. మంగళవారం నాడు డెక్కన్ హెరాల్డ్ ప్రతినిధితో మాట్లాడుతూ రెండు మిలిటరీ దళాలు మోహరించిన పిపి15 నుంచే గాక పిపి16 నుంచి కరవ్‌ు సింగ్ కొండవరకు మన ప్రాంతాన్ని తనిఖీలు లేని బఫర్ జోన్‌గా మన దేశం అంగీకరించిందని ఆరోపించారు.

దశాబ్దాల తరబడి పిపి16 వద్ద ఉన్న శాశ్వత పోస్టును ఎత్తివేసేందుకు మన దేశం అంగీకరించిందని, దాంతో స్థానికులు పశువులను మేపుకొనే క్రుగాంగ్ లోయను వివాదాస్పద ప్రాంతంగా అంగీకరించిందని, స్థానికుల అభిప్రాయాలను ఎవరు పట్టించుకుంటారని నిర్వేదాన్ని వెల్లడించారు. తాజా పరిణామాలపై బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ట్విటర్‌లో స్పందించారు. ‘వాస్తవాధీన రేఖ వెంబడి రెండు వైపులా చైనా, భారత్ మిలిటరీ ఉపసంహరణ జరిగిందని మోడీ ప్రభుత్వ ప్రకటనను ఉటంకిస్తూ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చైనీయులు నవ్వుతున్నారు. నిజం ఏమంటే, భారత్ వైపు ప్రాంతం నుంచి చైనా, భారత ప్రాంతం నుంచి భారత్ ఉపసంహరించుకుంది. ‘మాది ఏదైతే ఉందో అది మాదే, మీది ఏదైతే ఉందో అది కూడా మాదే’ అని దీని అర్ధంగా చైనా చెబుతోందని’ పేర్కొన్నారు.

తమ పార్టీ ప్రముఖుడే ఆరోపించినందున కేంద్ర ప్రభుత్వం, బిజెపి దీని మీద స్పందించి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. వాస్తవాలకు భిన్నంగా స్వామి ప్రకటనలు, ప్రచారం ఉన్నట్లయితే తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు స్వామి మీద చర్య తీసుకుంటుందా? గాల్వన్ వివాదం గురించి గతేడాది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు స్వామి అడిగిన ప్రశ్నను స్వీకరించేందుకు రాజ్యసభ ఆఫీసు తిరస్కరించింది. లడఖ్‌లో వాస్తవాధీన రేఖను చైనా అతిక్రమించిందా అన్న స్వామి ప్రశ్నలో సున్నితమైన సమస్యలు ఇమిడి ఉన్నందున సంబంధిత మంత్రిత్వశాఖ సిఫార్సు మేరకు సదరు ప్రశ్నను అంగీకరించటం లేదని పేర్కొన్నారు. గాల్వన్ ఉదంతం తరువాత ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఎవరూ మన ప్రాంతంలోకి ప్రవేశించలేదు, ఆక్రమించలేదు అని ప్రకటించారు. జాతీయ ప్రయోజనాల రీత్యా తన ప్రశ్నను ఆమోదించటం లేదని రాజ్యసభ సచివాలయం చెప్పటం విషాదం గాకపోతే హాస్యాస్పదం అని స్వామి స్పందించారు. తైవాన్, టిబెట్ ప్రాంతాలు చైనావే అని అంగీకరించటం నెహ్రూ, వాజ్‌పాయి తెలివి తక్కువ తనమని వారి కారణంగానే మనం జనం కూడా ఆమోదించారన్నారు. లడఖ్‌లో చైనా అక్రమంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్లు నరేంద్రమోడీ చెప్పటం లేదని కూడా కొద్ది వారాల క్రితం స్వామి సెలవిచ్చారు.

ఎవరూ ఆక్రమించలేదని చెప్పే మూర్ఖస్థితిలో ఉన్నారని అన్నారు. గతంలో ఉపసంహరించుకున్న ప్రాంతాలలో కూడా మన దేశం కొంత ప్రాంతాన్ని కోల్పోయినట్లు కొందరు మాజీలు చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొన్నది. లడఖ్ ప్రాంతంలో ఘర్షణ ఉన్న వివిధ ప్రాంతాల్లో మిలిటరీ ఉండని లేదా గస్తీ లేని ప్రాంతాలను ఏర్పాటు చేయటం పరిష్కారం కాదని, చైనా షరతులకు మనం అంగీకరిస్తున్నామని ఒక మాజీ లెప్టినెంట్ జనరల్ అన్నట్లు రాసింది. సేనల ఉపసంహరణల క్రమంలో భారత భూభాగంలో బఫర్ జోన్లకు ఎందుకు అంగీకరిస్తున్నట్లు అని ప్రశ్నించినట్లు పేర్కొన్నది. గతంలో సేనల ఉపసంహరణ జరిగిన చోట్ల కూడా బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతాలను బఫర్ జోన్లు అని పిలుస్తున్నారు. ప్రాంతాలను బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. డెప్సాంగ్ మైదానాల నుంచి రెండు వైపులా సేనల ఉపసంహరణ జరగాల్సి ఉంది. బఫర్ జోన్లను అంగీకరించటం అంటే అది వాస్తవాధీన రేఖకు రెండు వైపులా జరుగుతుంది. దాని అర్ధం ఆ ప్రాంతంపై సదరు దేశం హక్కును వదులుకున్నట్లు ఎలా అవుతుంది.

ఎలాంటి పోరు లేకుండానే వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర మన ప్రాంతాన్ని నరేంద్ర మోడీ సర్కార్ చైనాకు అప్పగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020 ఏప్రిల్ నాటి స్థితిని పునరుద్ధరించేందుకు చైనా తిరస్కరిస్తోందని, అప్పగించిన ప్రాంతాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారని ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఒక సమస్య పరిష్కారమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. సుబ్రమణ్య స్వామి, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేదు. మహమ్మద్ ప్రవక్త గురించి బిజెపి నేత నూపుర్ శర్మ దురుసు మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాటిని మన దేశం ఖండించటమే గాక వాటితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. పార్టీపరంగా ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు బిజెపి ప్రకటించింది. నూపుర్ శర్మ మాటలు మత ఉద్రిక్తతలకు దారితీసేవిగానూ, ముస్లిం దేశాలతో మన సంబంధాలు దెబ్బతినేవిగా ఉండటంతో ప్రభుత్వమూ, బిజెపి అలా స్పందించింది. ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ జవాబుదారీతనంతో కూడుకున్నది కాదు. ఈ మేరకు వచ్చిన వార్తల మీద నిలదీసే హక్కు రాహుల్‌కు వుండవచ్చు తప్ప నిర్ధారించి చెప్పటం ఏమిటి? సుబ్రమణ్యస్వామి వ్యవహారం అది కాదు, అధికార పార్టీలో ఉంటూ మన విదేశాంగ విధానాన్ని తప్పుపట్టటం ఏమిటి? పోనీ స్వామి చెప్పిన అంశాలు, వైఖరి పార్టీ విధానం కాదని బిజెపి ప్రకటించాలి కదా! దాని మౌనానికి అర్ధం ఏమిటి? స్వామి వంటి వారు చేస్తున్న వాదనలు, విమర్శలు సామాజిక మాధ్యమం, మీడియా, వివిధ సంస్థలలో తిష్ట వేసిన బిజెపిని బలపరిచే కాషాయ దళాలు చేస్తున్నవే. పార్టీ నుంచి వెలుపలికి వచ్చి స్వామి తనకు తోచిందాన్ని మాట్లాడితే అదొక తీరు.

భారత్, చైనా సరిహద్దులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా కాగితాల మీద బ్రిటీష్ వారు గీచిన రేఖ వలన వివిధ ప్రాంతాలు తమవంటే తమవని రెండు దేశాలూ చెబుతున్నాయి. రెండు దేశాలకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనదని చెబుతున్న ఆక్సాయిచిన్ చైనా ఆధీనంలో, తమది అని చైనా చెబుతున్న అరుణాచల్‌ప్రదేశ్ మన ఆధీనంలో ఉన్నది. ఇంకా ఇలాంటివి ఉన్నాయి. వీటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటం మినహా మరొక మార్గం లేదు. ప్రస్తుతం డెప్సాంగ్ మైదానాల్లో మనది అని చెబుతున్న చోట్ల పద్దెనిమిది కిలోమీటర్ల లోపలికి చైనా మిలిటరీ వచ్చిందని చెబుతున్నారు.

గాల్వన్ ఉదంతం జరిగినపుడు మన ప్రాంతాల ఆక్రమణ జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పటాన్ని బట్టి ఆ ప్రాంతం ఎప్పటి నుంచో చైనా ఆధీనంలో ఉన్నదని భావించాల్సి ఉంటుంది. మాజీ మిలిటరీ అధికారులు, నిపుణులు అని చెప్పుకుంటున్నవారు, కొందరు రాజకీయ నేతలు, దేశభక్తుల ముసుగులో ఉన్నవారు చెప్పే భాష్యాలు జనంలో మనోభావాలను రగిల్చేందుకు తప్ప ఇతరంగా పనికి రావు. చైనాతో అధికారిక చర్చల్లో పాల్గొనే పౌర, మిలిటరీ ఉన్నతాధికారులకు ఇవేమీ తెలియవని, వారికి దేశభక్తి లేదని, మన భూభాగాన్ని రక్షించుకోవాలనే తపన లేని వారని అనుకోవాలా? గత 28 నెలలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ, పరస్పర అనుమానాలు తొలగాలంటే సంప్రదింపులు తప్ప మరొక మార్గం లేదు. ఇప్పటి వరకు 16 దఫాల చర్చలు జరిగాయి.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News