వారణాసి: రాయబరేలి లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబం వద్దనే ఉంటుందని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ శనివారం ప్రకటించారు. రాయబరేలి ప్రజలకు అనేక తరాలుగా గాంధీ కుటుంబంతో బలమైన అనుబంధం కొనసాగుతోందని విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈ స్థానం గాంధీ కుటుంబానిదేనని, అలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్నకు ఆ విషయాన్ని గాంధీ కుటుంబమే నిర్ణయిస్తుందని రాయ్ చెప్పారు.
కాగా..కాశీ విశ్వనాథుని ఆలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించినపుడు ఆయన వెంట కెమెరాలను అనుమతించలేదని రాయ్ ఆరోపించారు. కాని బిజెపి నాయకులు ఆలయాన్ని సందర్శించినపుడు కెమెరాలను అనుమతించారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యాల ఫోటోలను ఆలయ నిర్వాహకులు ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆయన తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తన రెండవ రోజు ఉత్తర్ ప్రదేశ్ పర్యటనలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని శనివారం సందర్శించారు.