హైదరాబాద్: సాధారణంగా ఓ రోగితోపాటు ఇద్దరు సహాయకులు ఉంటుంటారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఇకపై రోగితో పాటు ఇద్దరినే అనుమతించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు తెలిపారు. రోగితోపాటు ఒక్కోసారి ఆరు నుంచి పది మంది వరకు బంధువులు వచ్చి, గేట్ వద్ద ఉన్న సిబ్బందితో తగవు పెట్టుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో తిట్లకు, దాడులకు కూడా దిగుతుంటారు. కొన్ని సందర్భాల్లో రోగి క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడు రోగి బంధువర్గం పెద్ద సంఖ్యలో వచ్చేస్తుంటారు. కానీ వారిని డాక్టరు పరీక్షించి తగు చికిత్స అందించడానికి అనువైన వాతావరణం ఉండాలి. రోగికి ఇతరుల నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా క్రిటికల్ కేర్, ఐసియూ, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉన్నప్పుడు. కొన్ని సందర్భాల్లో రోగితో వచ్చేవారు సిబ్బంది చెప్పేది అసలు పట్టించుకోరు, పైపెచ్చు వాగ్వాదానికి, దాడులకు దిగుతుంటారు. ఇప్పటికే చిలకలగూడ పోలీస్ స్టేషన్ కొన్ని కేసులను టేకప్ చేసింది.
ఇకపై గాంధీ ఆసుపత్రిలో గేటు వద్దే సెక్యూరిటీ రోగి బంధువులను తనిఖీ చేసి అనుమతిస్తుంది. అది కూడా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. రోగులు, వారి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఉంచడం, టాయిలెట్లను అపరిశుభ్రంగా తయారుచేయడం చేస్తున్నారన్న ఫిర్యాదు కూడా ఉంది. ఇక వాహనాలను పార్కింగ్ స్థలంలోనే ఉంచాల్సి ఉంటుంది.