Wednesday, January 22, 2025

గోరఖ్‌పూర్ గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ గీతా ప్రెస్‌ను ఎంపిక చేశారు.‘ అహింస, ఇతర గాంధేయ విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పును తీసుకు వచ్చే దిశగా అద్భుతమైన సేవలు అందించినందుకు గాను గీతా ప్రెస్‌ను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు ఆదివారం ఓ అధికార ప్రకటన తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం గోరఖ్‌పూర్ గీతా ప్రెస్‌ను ఈ పురస్కారం కోసం ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తెలిపింది. గాంధేయ సిద్ధాంతాలయిన శాంతి, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే దిశగా గీతా ప్రెస్ అందించిన సేవలను ప్రధానమంత్రి గుర్తు చేశారు.

ఏర్పాటయి వందేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత గీతా ప్రెస్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించడం సామాజిక సేవలో ఆ సంస్థ అందించిన సేవలకు గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.1923లో ఏర్పాటయిన గీతాప్రెస్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఆ సంస్థ 14 భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించింది. అందులో శ్రీమద్భగవద్గీత ఒక్కటే 16.21 కోట్లకు పైగా ముద్రించారు. ప్రతి ఏటా అందించే గాంధీ శాంతిపురస్కరాన్ని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా1995లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పురస్కారానికి విదేశీయులతో పాటుగా అన్ని వర్గాల వారు అర్హులే.

ఈ పురస్కారం కింద కోటి రూపాయల నగదు, ఓ జ్ఞాపిక, ప్రశంసా  పత్రం, కళాత్మకంగా రూపొందించిన హస్తకళా వస్తువు అందజేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ పురస్కారాన్ని అందుకొన్న వారిలో ఒమన్ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ అల్ సైద్( 2019), బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ (2020) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News