Monday, December 23, 2024

ఇక గండిపేట చెరువు సుందరంగా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో గండిపేట చెరువును ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే రూ.36 కోట్లతో ల్యాండ్ స్కేప్ పార్క్‌ను అద్భుతంగా నిర్మించగా ఇదే తరహాలో ఆధునిక శైలిలో గండిపేట చుట్టూరా 70 ఎకరాల్లో అద్భుతమైన పార్కు విస్తరణకు హెచ్‌ఎండిఏ చర్యలు చేపట్టింది. కాగా, రూ.1.77 కోట్లతో సేకరించిన స్థలం చుట్టూ రక్షణ చర్యగా ఫెన్సింగ్‌ను సైతం హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేసింది.

ఈ సుందరీకరణతో జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్ధశ పట్టనుంది. హుస్సేన్‌సాగర్ తరహాలోనే గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే చెరువు లోపలి వైపు ల్యాండ్ స్కేప్ పార్కును రూ.36 కోట్లతో అద్భుతంగా నిర్మించిన హెచ్‌ఎండిఏ, రెండో దశలో భాగంగా మరో 70 ఎకరాల స్థలంలో విస్తరణకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇందుకోసం సర్వే నెంబర్ 18, 45 పరిధిలోని సుమారు 70 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్‌ఎండిఏకు అప్పగించింది. గండిపేట చెరువు కట్ట కింద ఉన్న ఈ స్థలం ప్రస్తుతం నిరుపయోగంగా ఉండడంతో దీనిని అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది.
ల్యాండ్ స్కేప్ పార్క్
గండిపేటలో నిర్మించిన ల్యాండ్ స్కేప్ పార్క్‌ను గండిపేట్ ఎకో పార్క్‌గా పిలుస్తారు. ఇది గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక అందమైన ఆకర్షణ పార్కుగా రూపుదిద్దుకుంది. 18 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ పార్క్, గండిపేట్ రిజర్వాయర్ గట్టుపై ఉంది.
ఈ ఉద్యానవనం అన్ని ప్రకృతి ప్రేమికులకు అలాగే శివారు ప్రాంతాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. పెద్ద బహిరంగ థియేటర్‌తో, ఇది తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు చిహ్నాలు, అనేక కళాఖండాలను ఇది కలిగి ఉంది.
టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు
గండిపేట రిజర్వాయర్‌ను టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు హెచ్‌ఎండిఏ రెండు సంవత్సరాల క్రితం రూ. 100కోట్లతో సుందరీకరణ పనులకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా తొలి విడతగా జలమండలి ద్వారక పార్కుకు ఆనుకొని ఉన్న 18 ఎకరాల విస్తీర్ణంలో రూ. 35.60కోట్లతో ల్యాండ్ స్కేప్ పార్కు పనులకు శ్రీకారం చుట్టింది. కరోనాతో పనుల్లో కొంత ఆలస్యం జరిగినా అనంతరం ఈ పార్కు పనులను హెచ్‌ఎండిఏ శరవేగంగా పూర్తి చేసింది. ఈ పార్కులో కిడ్స్ ప్లే ఏరియా, పబ్లిక్ ఏరినా విత్ వాటర్ ఫ్రంట్ లైన్ డెవలప్‌మెంట్, హంపీ థియేటర్స్, బోర్డు వాక్, వివింగ్ డక్స్ అండ్ జెట్టీస్, ఫుడ్ కోర్టులు, స్కేటింగ్ జోన్, సైకిల్ ట్రాక్స్, వాక్‌వే, టెర్రస్ గార్డెన్స్, పిక్నిక్ స్పేస్, ఔట్ డోర్ జిమ్, ఆర్ట్ పవిలైన్స్, ఎంట్రన్స్ పవిలైన్ విత్ వాచ్ అండ్ వార్డ్ రూమ్, ఎంట్రన్స్ ప్లాజాలను ఏర్పాటు చేసింది.
మంత్రి కెటిఆర్ సూచనల మేరకు..
నగరానికి త్రాగునీరును అందిస్తూ, వరదలను అడ్డుకుంటున్న గండిపేట జలాశయం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను హెచ్‌ఎండిఏకు అప్పగించింది. గండిపేట చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించడంతో పాటు చుట్టూ 46 కి.మీ మేర వాకింగ్, సైక్లిల్‌ట్రాక్‌లను నిర్మించాలని ప్రతిపాదిం చింది. ఇప్పటికే గండిపేట లేక్‌వ్యూ పార్కును రూ.36 కోట్లతో నిర్మించగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే స్థాయిలో గండిపేట చుట్టూ సైకిల్‌ట్రాక్, వాకింగ్‌ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నేపథ్యంలో చెరువు కింద భాగంలో ఉన్న 70 ఎకరాలను సైతం అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండిఏ చర్యలు చేపట్టింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ సూచనల మేరకు ఈ 70 ఎకరాల స్థలాన్ని జీవ వైవిధ్యంతో కూడిన పార్కుగా తీర్చిదిద్దాలని హెచ్‌ఎండిఏ ప్రాథమికంగా నిర్ణయించింది.
డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నాటి..
ప్రస్తుతం హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేయనున్న సర్వే నెంబర్ 18, 45 పరిధిలోని సుమారు 70 ఎకరాల స్థలం పూర్తిగా చెట్లు, కొండలు, రాళ్లతో నిండి ఉంది. దీనిని పూర్తి స్థాయిలో పార్కుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను హెచ్‌ఎండిఏ చేపట్టింది. అందులో భాగంగానే మొదట స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ను చేపట్టింది. దీంతోపాటు డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నాటాలని నిర్ణయించింది. అందులో ఉన్న చెట్లు, ఇతర కాలువలను పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్మాణాలతో పార్కును నిర్మించాలో హెచ్‌ఎండిఏ నిర్ణయించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News