Sunday, December 22, 2024

‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య

- Advertisement -
- Advertisement -

ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం

భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్‌బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా, విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని శుక్రవారం రాత్రి 7 గంటలకు నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర సన్‌షైన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా సాగింది. ఈక్రమంలో ఎన్‌టిఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న క్రేన్ నం.4 వద్ద తుది పూజల అనంతరం నిమజ్జనం పూర్తి చేశారు. కాగా శుక్రవారం ఉదయం ప్రారంభమైన గణేషుణి శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లను అటు భక్తులు, ఇటు వీక్షకులు ప్రశంసించారు. వినాయక విగ్రహాల ఊరేగింపు నుంచి నిమజ్జనం వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా. ఏలాంటి అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోకుండా పోలీసుశాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఊరేగింపులో సందడి చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగింది.

నగరంలో గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను కనులారా వీక్షించారు. మొత్తం 10,470 మంది సిబ్బంది నిమజ్జన ప్రక్రియలో నిమగ్నం కాగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 కిలోమీటర్ల మేర డబుల్ లేయర్ భారీగేటతోపాటు నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూం, వాచ్‌టవర్లను ఏర్పాటు చేశారు.అంతేకాకుండా నిమజ్జనంలో భాగంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జిహెచ్‌ఎంసి ఎంటమాలజీ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేశారు. అలాగే జలమండలి అధికారులు భక్తులకు తాగు నీటి సౌకర్యం కల్పించారు.

ప్రత్యేక పూజలు 

ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మండపం వద్ద పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానంలో శిల్పి రాజేందర్ నేతృత్వంలో ఈసారి రూపొందించిన 50 అడుగుల మట్టి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. ఏటా 40 టన్నుల బరువులోపే ఉండే మహా గణపతి మట్టితో తయారు చేయడం వల్ల ఈసారి 70 టన్నులకు చేరింది. ఖైరతాబాద్ గణపతిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు గురువారం అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న 26 టైర్ల ప్రత్యేక వాహనంపైకి మహాగణనాథుడి విగ్రహాన్ని ఎక్కించి కదలకుండా ఉండేందుకు వెల్డింగ్ పనులు చేపట్టి శోభాయాత్ర నిర్వహించారు.

ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన 

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ,డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజి జితేందర్, సిపి సివి ఆనంద్‌లు ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలు దేరి ట్యాంక్ బండ్, చార్మినార్ తదితర ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఘనంగా నిమజ్జనం ః మంత్రి తలసాని

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాలలో పర్యటించి గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. ముందుగా ఖైరతాబాద్ గణేష్ మండపానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బాలాపూర్ గణేష్ మండపం వద్దకు చేరుకొని లడ్డు వేలం పాటను తిలకించారు. అక్కడి నుండి చార్మినార్, మోజం జాహి మార్కెట్ వద్దకు చేరుకొని నిమజ్జనానికి వెళుతున్న వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. తదనంతరం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని హుస్సేన్ సాగర్ లో మేయర్ విజయలక్ష్మితో కలిసి బోట్ లో తిరుగుతూ గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గణేష్ నవరాత్రును ఘనంగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించినట్లు వివరించారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణనాధుడు అని, ఆయనను దర్శించుకొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రశాంతంగా నిమజ్జనం : డిజిపి

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. నిమజ్జన సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సిసి కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో 35,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ముఖ్యంగా సున్నితమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ప్రత్యేక ఏర్పాటు చేశామని, శనివారం ఉదయం వరకు వినాయక నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. డిజిపి కార్యాలయం నుండి హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ను సిసిటివిల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.

వినాయకుడి నిమజ్జనానికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు లక్షల సంఖ్యలో సిసి కెమెరాలతోపాటు మౌంటెడ్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. దీనికి తోడు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నామని, నిమజ్జనానికి నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా హుస్సేన్‌సాగర్‌కు విగ్రహాలు తరలివచ్చాయన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ప్రధాన చెరువులు, తాత్కాలిక కొలన్ల వద్ద విగ్రహాలతో వెళ్లే వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు.అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్‌లు సమావేశాలు ఏర్పాటు చేశారన్నారు. నిమజ్జనానికి తరలించే రూట్లపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించామని, నగరంలో పదిరోజులు గా ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల అటు పోలీసు అధికారులకు, ఇటు ప్రజలకు డిజిపి అభినందనలు తెలియచేసారు.

ఊరేగింపుల్లో సందడి 

హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసినా నిమజ్జన సందడి కనిపించింది. వీధుల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ గణనాథుడి విగ్రహాలను ఊరేగింపునకు తరలివచ్చారు. ఒకవైపు వర్షం పడుతున్న యువతీయువకులు హుషారుగా నిమజ్జన శోభయాత్రలో సందడి చేశారు. ముఖ్యంగా గణణాధుల విగ్రహాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కోలాహాలంగా మారాయి. ప్రతీ విగ్రహం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.గణపతి బప్పా మోరియా, గణేశ్ మహారాజ్‌కు జై అంటూ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు తరలివచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ 200 సిసి కెమెరాలను జిహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాటు చేయడంతో పాటు కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. నిమజ్జనం అనంతరం హుస్సేన్‌సాగర్‌లోని వ్యర్థాల తొలగించేందుకు 20 జెసిబిలు, 168 యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

బాలపూర్ లడ్డుకు భలే ధర 

బాలాపూర్ లడ్డూ ధర ఈ రికార్డ్ స్థాయిలో రూ.24 లక్షల 60 వేలకు ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.ముగ్గురు స్థానికేతరులకు ఆరుగురు స్థానికులకు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో చివరకు స్థానికుడైన లక్ష్మారెడ్డి లడ్డును దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి రూ.5 లక్షల 70 వేలకు ఎక్కువగా పాడి లక్ష్మారెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నారు.మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ఆద్యంతం వేలం పాటను వీక్షించారు. ఈక్రమంలో 29 ఏళ్లుగా వైభవంగా లడ్డూ వేలంపాటను నిర్వహిస్తున్న బాలాపూర్ ఉత్సవ సమితికి అభినందనలు తెలిపారు. గణేశుడి ఆశీస్సులతో బాలాపూర్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ లడ్డూవేలం పాటను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో బాలాపూర్ ముఖ్య కూడలితో పాటు వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.1994లో రూ.450తో మొదలైన లడ్డూ వేలం పాట 2022లో రికార్డు స్థాయిలో రూ. 24.60 లక్షలు పలకిందని నిర్వహకులు వివరించారు.

స్వల్ప అపశృతి ః భాగ్యనగరం గణేశ్ నిమజ్జనోత్సవంలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్తున్న గణేశ్ విగ్రహం కూలిన ఘటన హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్‌లోని టికెఆర్ కళాశాల వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్త్తుండగా హిమాయత్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద విగ్రహం కూలిపోయింది. ఈక్రమంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పాటు దారిలో అక్కడక్కడ కేబులు వైరులతో పాటుగా చెట్టు కొమ్మలు విగ్రహానికి తగలడంతో ఒక్క సారిగా పడిపోయిందని నిర్వహకులు పేర్కొంటున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో జరగ్గా సకాలంలో వాటిని తరలించడానికి క్రేన్ రాకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News