మన తెలంగాణ/సిటీ బ్యూరో: పదకొండు రోజులు పూజలు అందుకున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు చేసినప్పటి నుంచి నిమజ్జనం వరకు అవిశ్రాంతంగా పనిచేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి నగర ప్రజలు సహకరించారని తెలిపారు.
ఈ ఏడాది భారీ ఎత్తున విగ్రహలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందని తెలిపారు. నిమజ్జనం రోజునే “మిలాద్ ఉన్ నబీ” పండుగా ఉండటంతో ర్యాలీని ముస్లిం మత పెద్దలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన “మిలాద్ ఉన్ నబీ” ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని, ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్‌ను ముందుగా నిమజ్జనం చేశామని తెలిపారు. శుక్రవారం కూడా ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కోసం వచ్చాయని తెలిపారు.
నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజాలో విగ్రహలు ఉన్నాయని, 450 విగ్రహాలు నిమజ్జనానికి మిగిలి ఉన్నాయని తెలిపారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 10,020 విగ్రహాలు నిమజ్జనం చేశారని తెలిపారు. ఐదు ఫీట్ల నుంచి మిగిలినవి సంబంధించిన విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుండి 15శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. నిమజ్జనం సమయంలో రెండు విషాదకరమైన ఘటనలు జరిగాయని, బషీర్‌బాగ్, సంజీవయ్యపార్క్, సికింద్రాబాద్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతిచెందారని తెలిపారు.
నిమజ్జనం కోసం 48 గంటల నుంచి పోలీసులు అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. హుస్సేన్‌సాగర్, ప్రసాద్ ఐ మ్యాక్స్ ప్రాంతాల్లో నార్మల్ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. మిగిలిన విగ్రహాల నిమజ్జనానికి ఇంకా 5గంటల సమయం పడుతుందని తెలిపారు. పోలీస్ ఆఫీసర్లు విజ్ఞప్తి చేసినా కొంతమంది మండప నిర్వాహకులు కావాలనే ఆలస్యంగా విగ్రహాలను తీసుకువచ్చారని తెలిపారు. నిమజ్జనంలో మండప నిర్వాహకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది, ప్రజలను ఇబ్బందులను గురి చేయొద్దని తెలిపారు.