కర్నాటక ప్రభుత్వం అనుమతి
సుప్రీంలో త్రిసభ్య ధర్మాసనానికి కేసు బదిలీ
న్యూఢిల్లీ: బెంగళూరులోని ఈద్గా మైదానాన్ని బుధవారం, గురువారం&రెండు రోజుల పాటు గణేశ్ చతుర్థి ఉత్సవాలకు ఉపయోగించుకోవడానికి కర్నాటక ప్రభుత్వం అనుమతించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియచేశారు. ఈ కేసులో కర్నాటక హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ ఈ విషయం తెలియచేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీచేసినట్లు ధర్మాసనం తెలిపింది. నూతన ధర్మాసనంలో జస్టిస్ ఇందిరా మల్హోత్ర, జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ న్యాయమూర్తులుగా ఉంటారు. కాగా&ఆగస్టు 25న కర్నాటక హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ తీర్పు వెలువరిస్తూ బెంగళూరు ఈద్గా మైదానాన్ని ప్రభుత్వం లేదా బిబిఎంపి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి, ముస్లిం సమాజం రెండు ఈద్‌ల నాడు ప్రార్థనలు జరుపుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అయితే దీనిపై డివిజన్ బెంచ్‌కు పిటిషనర్లు వెళ్లగా ఆ మైదానంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.