Thursday, December 19, 2024

లంబో’ధర దడ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్‌టి 18 శాతం పెరగడంతో విగ్రహాల ధరలు ఆకాశాన్నంటాయి. అదేవిధంగా ఈ ఏడాది సైతం కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తక్కువ స్థాయిలోనే విగ్రహాల తయారీ చేయడంతో తయారు చేసిన విగ్రహాలకు గత ఏడాది కంటే 40శాతం ధర లు పెంచి విక్రయిస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు గణేశ్ విగ్రహాలు, అలంకరణ సామగ్రి ధరలు పెరగడంతో సమమతమౌతున్నారు.

ముఖ్యంగా విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25-30 శాతం పెరడడం, విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి రావడంతో విగ్రహాల ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు తేల్చిచెబుతున్నారు. మండపాల నిర్మాణానికి వినియోగించే వెదు రు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, లేజర్ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10 నుంచి -20 శాతం పెరిగా యి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహకులకు, మధ్య తరగతి కుటుంబాలకు విగ్రహాల కొనుగోలు భారంగా మారింది. చిన్న విగ్రహాలు సైతం అత్యధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే సామాన్య భక్తులు చిన్నపాటి మట్టి వినాయకులపై దృష్టి సారిస్తున్నారు.

పెరిగిన ముడిసరుకు ధరలు 

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అన్ని వస్తువులకు భారీగా ధరలు పెరిగాయి. గత సంవత్సరం కెజి పివొపి రూ.130 లభించగా ఇప్పుడు రూ.210పైగా విక్రయిస్తున్నారు. అలాగే రంగుల ధరలు 10 నుంచి -20 శాతం, ఇనుప చువ్వల ధరలు 50 నుంచి -60 శాతం మేర పెరిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విగ్రహాల తయారు చేసే వారి శాతం క్రమంగా తగ్గింది. అలాగే గుజరాత్‌లో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వర్క్ షాపుల్లోకి రావల్సిన కలప నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడడంతో వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరిగాయని, గత్యంతరం లేక విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని బడా విగ్రహాల తయారీదారులు అంటున్నారు. అలాగే కరోనా కాలంలో అమలుచేసిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారని, దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడిందని, వారికి కూడా ఎక్కువ కూలీలిచ్చి రప్పించాల్సిన దుస్ధితి వచ్చిందంటున్నారు. ఎక్కువ జీతంతో పనులు చేయించుకోవల్సి వస్తోందని విగ్రహాల తయారీదారులు వాపోతున్నారు.

భారీ విగ్రహాల ధరలు పైపైకి 

భారీ విగ్రహాల తయారీలో వినియోగించే ఇనుప చువ్వలు, కలప ధరలు పెరగటంతో విగ్రహాల ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. విగ్రహాల డిమాండ్ పెరిగిన క్రమంలో సమయం తక్కువగా ఉండడంతో కళాకారులకు, కార్మికులకు ఓవర్ టైం డబ్బులు చెల్లించడంతో భోజన, బస వసతులు కల్పించి పనులు చేయించుకోవల్సిన పరిస్ధితి వచ్చిందంటున్నారు. ఇలా అన్ని విధాల ఖర్చులు పెరగడంతో విగ్రహాల ధరలు పెంచకతప్పడం లేదని వ్యాపారులు సైతం వాపోతున్నారు. వెరసి ఈ సారి ధరలు గత ఏడాది కంటే దాదాపు 40 శాతం పెరిగాయని గణేశ్ విగ్రహాల తయారీదారులు వివరిస్తున్నారు.

ఈ సారి విగ్రహాలను తక్కువ తయారు చేశామని, కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయని తెలిపారు. ఈ సారి మాత్రం వినాయకుడి భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఉందని గణేశ్ విగ్రహాల తయారీదారుడు తెలిపారు. వినాయక చవితికి మరో వారం రోజులు ఉండగానే భక్తులు భారీగా వచ్చి కొనుగోళ్ళు చేస్తున్నారని, విగ్రహాలకు డిమాండ్ ఇంతగా ఉంటుందని ఊహించలేదని వివరిస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు కూడా భారీగా పెరిగాయని,ఈ నేపథ్యంలో 10 అడుగుల విగ్రహం రూ.30 వేల వరకు ధర పలుకుతోందని తెలిపారు.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి 

వినాయకచవితికి రెండు నెలలు ముందుగానే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, కటక్, బాలాసోర్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలు తయారు చేసే చిత్రకారులు క్యాంపులు నిర్వహించి వినాయక విగ్రహాలు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి భారీ విగ్రహాలను తయారు చేస్తుంటారు. గత రెండేళ్లుగా కరోనా వ్యాప్తి కారణంగా తమ ఉపాధికి గండి పడిందని వారు వాపోతున్నారు.

ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గినప్పటికీ జిఎస్‌టి భారంతో విగ్రహాల ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. నీటిలో తేలికగా కరిగే రంగులకు సైతం ధరలు పెరగడంతో విగ్రహాల తయారీకి పెట్టుబడి ఎక్కువవుతోందని చెబుతున్నారు. దీంతో తమకు గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. కాగా నగరంలోని ధూల్ పేట, నాగోల్, హయత్ నగర్, కూకట్ పల్లిలో విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రేట్ల విషయంలో మాత్రం గతంతో పోలిస్తే డబుల్ రేట్లు పలుకుతున్నాయి. గతంలో 5 అడుగుల విగ్రహాలు రూ.15 నుంచి రూ. 20 వేలకు వస్తే ప్రస్తుతం రూ. 35వేలు పలుకుతున్నాయి. విగ్రహాల తయారీకి వాడే ముడిసరుకు ధరలు భారీగా పెరుగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందంటున్నారు విగ్రహాల తయారీదారులు.

ఉచితంగా మట్టి గణపతులు 

పర్యావరణ హితం కోసం జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో జంట నగరాల్లో జోనల్ వారిగా మూడు లక్షల మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.మట్టి విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు లక్షల విగ్రహాలు తయారు చేయగా, అవసరం మేరకు లక్ష ప్రతిమలను సిద్దం చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News