బండ్లగూడ జాగీర్‌లోని గణనాథుడి లడ్డూ ధర రూ. కోటి 25 లక్షలు
బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు
మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో లడ్డూ ధర రూ.25 లక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి లడ్డూల వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. బండ్లగూడ జాగీర్‌లోని గణనాథుడి లడ్డూ ధర రూ.కోటి 25 లక్షలు పలకగా, బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు, మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో రూ. 25 లక్షల ధర పలకడం విశేషం. ఇలా పలుచోట్ల జరిగిన వేలంలో లడ్డూను దక్కించుకోవడానికి పలువురు భక్తులు పోటీ పడ్డారు. హైదరాబాద్ బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణనాథుడి లడ్డూ రూ.కోటి 25 లక్షలు పలకగా దీనిని కీర్తి రిచ్మండ్ విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి ఈ లడ్డూను సొంతం చేసుకుంది. ఇక మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు భక్తులు దక్కించుకున్నారు.
గత రికార్డులను బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ
రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ వేలం పాటలో రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.2 లక్షల 40 వేలు అధికం కావడం విశేషం. 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 36 మంది వేలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు. 1980లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది రూ.450లకు లడ్డూ పాటలో దక్కించుకోగా 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దయింది.
1994 నుంచి ఇప్పటివరకు లడ్డూ వేలం -విజేతలు
1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450, 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500లు, 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు, 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు, 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు, 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు, 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు, 2001 జి. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు, 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000లు, 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000లు, 2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000, 2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000లు, 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు, 2007లో జి.రఘనాథమ్ చారి- రూ.4,15000లు, 2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000లు, 2009లో సరిత- రూ.5,10,000, 2010లో కొడాలి శ్రీధర్ బాబు- రూ.5,35,000లు, 2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000లు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000లు, 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000లు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000లు, 2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000లు, 2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000లు, 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు, 2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000లు, 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు, 2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఎపి ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000లు, 2023లో దాసరి దయానంద్ రెడ్డి – రూ. 27 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు.