Thursday, December 26, 2024

హత్యాచార ఘటన చోటే విధ్వంసం.. అర్థరాత్రి వేళ ఎమర్జెన్సీ వార్డులో అరాచకం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా ఆర్‌జి కార్ ఆసుపత్రిపై మూక దాడి
ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న నర్సులు, సిబ్బంది
రాళ్లు విసరడంతో పోలీసులకు గాయాలు
దారుణ ఉదంత సాక్షాల చెరిపివేత యత్నం?
ఓ వైపు మహిళల రీక్లెయిమ్ నైట్ దశలోనే హింసాకాండ
కోల్‌కతా: స్థానిక ప్రభుత్వ ఆర్‌జి కార్ ఆసుపత్రిపై బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత దుండగులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గత వారం ఈ ఆసుపత్రిలోనే విధులలో ఉన్న ఓ లేడిడాక్టర్‌పై హత్యాచారం ఘటన తరువాత ఇక్కడ భీకర స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆసుపత్రిపై దాడికి దిగిన దుండగులు లోపలి పలు విభాగాలను ధ్వంసం చేశారు. దీనితో విధులలో ఉన్న పలువురు నర్సులు, డాక్టర్లు భయంతో వణికిపొయ్యారు. ఆసుపత్రిలోపలికి దుండగులు చొచ్చుకువచ్చి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇక తమ ప్రాణాలకు దిక్కేది అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సులు, ఆసుపత్రి సిబ్బంది నిరసనకు దిగింది. తమకు సరైన భద్రత ఏర్పాటు చేయాలని, బందోబస్తు కట్టుదిట్టం చేయాలని గురువారం ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆసుపత్రిపై ఈ విధమైన గూండాయిజం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.

హత్యాచారంపై మహిళల నిరసనల నడుమనే దాడి ఘటన
ఆసుపత్రిలో డాక్టర్‌పై జుగుప్సాకర అత్యాచారం, ఈ క్రమంలో ఆమె ప్రాణాలొదిన ఘటనపై స్థానిక మహిళల బృందం ఒకటి అర్థరాత్రి వేళ ఈ ఆసుపత్రి ఆవరణలో నిరసన ప్రదర్శనకు దిగింది. స్వాతంత్య్రం వచ్చిన అర్థరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం అంటూ వీరు నిరసన వ్యక్తం చేశారు. పనిచేసే చోట మహిళకు రక్షణ, భద్రత కోసం రిక్లెయ్లిమ్ ది నైట్ పేరిట ఈ ఆసుపత్రి వద్దనే కాకుండా నగరంలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు.

ఈ దేశానికి అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. కానీ మహిళల ప్రాణాలకు రక్షణ లేదా? వారి బతుకులు ఈ విధంగా తెల్లారిపోవాల్సిందేనా? అని నినదిస్తూ మహిళలు నిరసనకు దిగుతున్న దశలోనే 40 మంది వరకూ ఆసుపత్రిలోకి చొరబడ్డారు. ఆందోళనకారులుగా నినాదాలకు దిగుతూ ఉన్నట్లుండి లోపలి ఫర్నిచర్‌ను , పెషెంట్ల బెడ్‌లను ఇతరత్రా పరికరాలను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై ఈ మూక రాళ్లు విసిరింది. ఈ దశలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఘటనలో ఈ ఆసుపత్రి ఆవరణలోని పోలీసు వాహనం, కొన్ని బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి అగమ్యగోచరం అయింది. దుండగుల మూక చేయిచేసుకోవడం, రాళ్లు విసిరిన ఘటనల్లో కొందరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.

ఈ ప్రాంతంలో పలు విధాలుగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని, ఆసుపత్రి వెలుపల పోలీసు గస్తీ చేపట్టారని అయితే దుండగులు మెరుపుదాడికి పాల్పడి ఉంటారని సీనియర్ పోలీసు అధికారి ఒక్కరు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అర్థరాత్రి వేళ ఓ వైపు రీక్లెయిమ్ ది నైట్ ఉద్యమానికి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ఆదరణ దక్కుతున్న దశలోనే అర్థరాత్రి దాటిన తరువాత ఆసుపత్రిపై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో కూడా విధ్వంసం జరిగింది. ఆసుపత్రిలో సిసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేసిన తరువాత దుండగులు స్వైర విహారం చేశారు. దుండగులు ఎక్కువగా ఆసుపత్రిలోని సెమినార్ రూం వద్దకు చేరుకునేందుకు యత్నించినట్లు వెల్లడైంది. ఇక్కడనే గత వారం లేడీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. పలువురు పోలీసులు కూడా లోపల ఉన్న సెఫ్టీరూంలలో తలదాచుకున్నారని , ఇక తమ పరిస్థితి ఏమిటని నర్సులు , సిబ్బంది వాపొయ్యారు. ఆసుపత్రిలోని మొదటి రెండు అంతస్తులను ధ్వంసం చేసి మూడో ఫ్లోర్‌లోకి వెళ్లడానికి యత్నించారని వెల్లడైంది. డాక్టర్లు నిరసన తెలిపే వేదికను కూడా దుండగులు దెబ్బతీశారు.

గురువారం ఆసుపత్రికి రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్
ఆసుపత్రిపై దాడి ఘటనను రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ ఖండించారు. ఇది సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. గురువారం ఉదయం ఆయన ఆసుపత్రికి చేరుకుని, దెబ్బతిన్న వార్డులను పరిశీలించారు. ఉద్యమిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. ఇక్కడ జరిగిన ఘటనతో అంతా సిగ్గుతో తలదించుకోవల్సిందే అని గవర్నరు తెలిపారు. యువతులకు భద్రత లేకపోవడం దారుణం. దీనికి అంతం పలకాల్సిందే అన్నారు. న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నానని , కలిసికట్టుగా ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవల్సి ఉందన్నారు. అంతా శ్రద్ధగా గమనిస్తూ వస్తున్నానని అన్నారు.

పూర్తిగా ధ్వంసం అయిన ఎమర్జెన్సీ విభాగాన్ని గవర్నర్ సందర్శించారు. గురువారం ఉదయం పలువురు డాక్టర్లు గవర్నర్‌ను కలిశారు. ధైర్యంగా పనిచేసే పరిస్థితి లేదని, భయం భయంగా ఉందని , తగు విధంగా ఆదుకోవాలని కోరారు. కాగా గురువారం ఉదయం గవర్నర్ కార్యాలయం ప్రత్యేకంగా అభయ పోర్టల్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలో ఎటువంటి భయాందోళనకు గురైతు ఎవరైనా ఈ పోర్టల్‌కు తెలియచేసుకోవచ్చు. హింసాత్మక ఘటనల సమాచారం తెలియగానే నగర పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాత్రి రెండు గంటలకు ఆసుపత్రి వద్దకు చేరారు పరిస్థితిని సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News