30మంది మృతి, 47మందికి గాయాలు
క్విటో: ఈక్వెడార్‌లోని ఓ జైలులో రెండు ఖైదీ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో 30మంది చనిపోగా, 47మంది గాయపడ్డారు. మంగళవారం ఈ హింసాత్మక ఘటన గ్వాయాక్విల్ రాష్ట్రంలోని రీజియనల్‌జైలులో జరిగింది. లాస్‌లాబోస్, లాస్ కోనెరాస్ అనే ఖైదీ ముఠాల మధ్య ఈ ఘర్షణ జరిగిందని ఈక్వెడార్ జైలు అధికారులు తెలిపారు. జైలు గదుల్లోని కిటికీలలోంచి ఈ ముఠాలు ఒకరిపైకి ఒకరు కాల్పులు జరుపుకుంటూ, బాంబులు విసురుకున్న దృశ్యాలు స్థానిక టీవీల్లో ప్రసారమయ్యాయి. జైలులో పొగ విరజిమ్మడంతో పేలుళ్లు జరిగినట్టు భావిస్తున్నారు. ఘటన గురించి తెలియగానే మిలిటరీ సహాయంతో పోలీస్ ఆపరేషన్ చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు గ్వాయాక్విల్ గవర్నర్ ప్యాబ్లో అరోసెమీనా తెలిపారు. ఈక్వెడార్ జైళ్లలో ఖైదీ ముఠాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ, జులైలోనూ ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో దాదాపు 100మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో జైలు వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మోలాసో జులైలో ప్రకటించారు.