Monday, December 23, 2024

వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.5,20,000 విలువైన గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు, కారు, నాలుగు మొబైల్స్, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు, రూ.5వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఇండ్లనే లక్షంగా చేసుకొని చోరీలకు పాల్పడటమే కాకుండా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల గల మజియాబాద్ అంతరాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన అక్బర్ ఖురేషీ, మిరాట్ జిల్లాకు చెందిన కిపల్ జాటోవు, ఘజియాబాద్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్, యండి.జాద్‌ఖాన్‌లు ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 5న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మట్టేవాడ, హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఎనిమిది ఇండ్లను లక్షంగా చేసుకొని పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీలు జరిగాయని తెలిపారు.

ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ క్రైమ్స్ దాసరి మురళీధర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చోరీలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు వరంగల్‌లో వరుస చోరీలు జరిగిన ముందు రోజున ఆదిలాబాద్, మరుసటి రోజు బెంగుళూరులో ఇదే తరహా చోరీలు జరిగినట్లుగా గుర్తించారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఆదిలాబాద్, బెంగుళూరులో చోరీలు జరిగిన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల కదలికలకు సంబంధించి సీసీ దృశ్యాలతో పాటు నిందితులు వినియోగించిన కారును ఫొటోలను సేకరించారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఇదే తరహాలో చోరీలు ఏ ఏ రాష్ట్రాల్లో జరిగినట్లు విచారించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఇదే తరహాలో గ మే నెలలో చోరీలు జరగగా, ఈ చోరీలకు పాల్పడిన నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసుల విచారణలో నిర్థారణ కావడంతో నిందితులను అరెస్టు చేసి కర్నూరులు నాల్గొవ పట్టణ ఇన్స్‌పెక్టర్ శంకరయ్యతో పాటు స్టేషన్ సిబ్బంది సహకారాన్ని తీసుకోవడంతో పాటు వారిని సైతం ప్రత్యేక దర్యాప్తు బృందంలో నియమించడం జరిగిందని తెలిపారు.

దర్యాప్తును వేగం పెంచిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లోని టోల్ ప్లాజాలు, సీసీ కెమెరాల దృష్యాల ఆధారంగా పోలీసులు తమ వద్ద అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితులను పట్టుకునేందుకు వేట కొనసాగించారు. ఇందులో భాగంగా బుధవారం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేసే క్రమంలో కారులోని అనుమానితులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభకనబర్చిన క్రైమ్ డీసీపీ దాసరి మురళీధర్, క్రైమ్ ఏసీపీ మల్లయ్య, మట్టేవాడ, మహిళా పోలీస్ స్టేషన్ 1, సీసీఎస్, హనుమకొండ, సుబేదారి ఇన్స్‌పెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యప్రసాద్, శంకర్‌నాయక్, కరుణాకర్, షుకూర్, కర్నూల్ జిల్లా నాల్గొవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ శంకరయ్య, ఏఏఓ సల్మాన్‌పాషా, ఎస్‌ఐలు విఠల్, కిశోర్, అనిల్, సంపత్‌కుమార్, రాజేందర్, బాబురావు, యాదగిరి, ఏఎస్‌ఐ తిరుపతి, గోపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, రవి, మున్నా, రోషన్ ఆలీ, కర్నూలు జిల్లా కానిస్టేబుళ్లు నాగరాజు, శ్రీనివాసులు, వరంగల్ కమిషనరేట్ కానిస్టేబుళ్లు ఆలీ, మధు, వంశీ, విశ్వేశ్వర్, శివ, గౌస్‌పాషా, సదానందంలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News