నేడు కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలూ బంద్
ఉత్తర కాశి: శీతాకాలం మొదలవడంతో ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర గంగోత్రి ఆలయం మహాద్వారం తలుపులను మూసివేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య గంగోత్రి మందిర్ సహ కార్యదర్శి రాజేశ్ సేంవాల్ శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆలయం తలుపులను మూసి వేశారు. గుడిలోని గంగాదేవి విగ్రహాన్ని శీతాకాలం విడిది అయిన ముఖ్‌బా గ్రామానికి పూలతో అలంకరించిన పల్లకిలో తీసుకు వచ్చారు. గత సెప్టెంబర్‌లో కొవిడ్ ఆంక్షల మధ్య గంగోత్రి ఆలయాన్ని భక్తుల కోసం తెరిచిన తర్వాత ఈ సీజన్‌లో మొత్తం 32,958 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. కొవిడ్ కేసులు తగ్గడంతో ఉత్తరాఖండ్ హైకోర్టు రోజువారీ భక్తుల పరిమితిపై ఆంక్షలను ఎత్తివేయడంతో భక్తుల సంఖ్య పెరిగింది. గర్వాల్ హిమాలయాల్లో మంచు కురవడం మొదలవడంతో ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ మధ్య కాలంలో గంగోత్రి ఆలయాన్ని మూసి వేస్తారు. అలాగే చార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం, బదరీనాథ్ ఆలయాన్ని ఈ నెల 20న మూసివేస్తారు.