సహర్సా/ పాట్నా: ఓ ఐఎఎస్ అధికారి హత్య కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ గురువారం ఉదయం సహర్సా జైలునుంచి విడుదలయ్యారు. ఆనంద్ మోహన్‌తో పాటుగా 27 మంది దోషులను శిక్షాకాలం పూర్తి కాకముందే విడుదల చేయడానికి వీలుగా బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల నిబంధనలను సవరించడంతో ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం అయింది. జైలునుంచి విడుదలైన ఆనంద్ మోహన్ ఈ రోజు తన ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది.
Also read: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ బహుమతి
1994లో అప్పటి గోపాల్ గంజ్ కలెక్టర్ జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ గత 15 ఏళ్లుగా జైలులో ఉన్నాడు.2007లో స్థానిక కోర్టు ఆయనకు మొదట మరణ శిక్ష విధించగా ఆ తర్వాత ఆయన కింది కోర్టు తీర్పుపై అపీలుచేసుకోవడంతో పాట్నా హైకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. అయితే ఓ ఐఎఎస్ అధికారిని దారుణంగా హత్య చేసిన దోషులను విడుదల చేయాలన్న బీహార్ ప్రభుత్వం నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.
Also read: గవర్నర్‌కు షర్మిల లేఖ
నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్ష బిజెపి తీవ్రంగా మండిపడుతోంది. మిత్రపక్షమైన ఆర్‌జెడి మద్దతుతో అధికారంలో కొనసాగడం కోసం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చట్టాన్ని బలి ఇచ్చారని బిజెపి ఎంపి సుశీల్ మోడీ మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం నిర్ణయం పట్ల ఐఎఎస్ అధికారుల సంఘం, దివగత ఐఎఎస్ అధికారి కృష్ణయ్య సతీమణి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.