Tuesday, November 5, 2024

గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్..

- Advertisement -
- Advertisement -

మీరట్ : ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను పోలీసు ప్రత్యేక దళం ఎన్‌కౌంటర్ చేసింది. హత్యోదంతంలో నిందితుడు అయిన అనిల్ దుజానా బెయిల్‌పై ఉండగా మీరట్‌లో ఎస్‌టిఎఫ్ ఎదురుకాల్పుల్లో గురువారం మృతి చెందాడు. నోయిడా, గజియాబాద్ ఇతర ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంతంలో అనిల్ దుజానా తన గ్యాంగ్‌తో కలిసి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ తిరుగులేని నేర సామ్రాజ్యాని నడిపిస్తున్నాడు. హతుడు దుజానాపై 60కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ల పనిపడుతామని, నేరగాళ్లను ఏరివేస్తామని అసెంబ్లీలోనే సిఎం యోగి ఆదిత్యానాథ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్ అయిన దుజానా వారం రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు.

తనపై హత్యకేసులో ప్రధాన సాక్షిని ఈ నిందితుడు బెదిరిస్తూ వచ్చినట్లు , సాక్షం అనుకూలంగా లేకపోతే చంపివేస్తామని బెదిరించినట్లు వెల్లడైందని పోలీసు అధికార వర్గాలు తెలిపాయి. దుజానా ఆగడాలపై ఫిర్యాదు అందడంతో ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బలగం (ఎస్‌టిఎఫ్) రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే గురువారం మీరట్ వద్ద పరస్పర కాల్పుల దశలో ఈ గ్యాంగ్‌స్టర్ హతుడు అయినట్లు పోలీసులు తెలిపారు. మీరట్ పరిధిలోకి వచ్చే సమీప గ్రామంలో ఓ కచ్చారోడ్డుపై చుట్టు గుబురు పొదలు చెట్లు ఉన్న చోట ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో నక్కి ఉండి దుజానా ఆయన గ్యాంగ్ తమపై కాల్పులకు దిగినట్లు లొంగిపోవాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో తాము కాల్పులు జరిపినట్లు ఈ దశలో ఆయన చనిపోయినట్లు వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్‌లపై ఉన్న కేసులకు సంబంధించి రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలువురు ప్రధాన సాక్షులు కాల్పుల్లో చనిపోతూ వస్తున్నారు.

దీనితో ఈ ఘటనలపై ఎస్‌టిఎఫ్ ప్రధానంగా దృష్టి సారించింది. దుజానా విషయంలో కూడా సాక్షిపై బెదిరింపులు రావడంతో పట్టుకునేందుకు యత్నించారని వెల్లడైంది. గత నెలలోనే గ్యాంగ్‌స్టర్ రాజకీయ నాయకుడు అయిన అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చివేశారు. తరువాత జరిగిన ఘటనలో సంచలనాత్మక రీతిలోఅతీక్, ఆయన సోదరుడు జర్నలిస్టుల ముసుగులో వచ్చిన వారి చేతుల్లో అతి దగ్గరి నుంచి కాల్పులకు గురై చనిపోయారు. సంబంధిత అంశం ప్రయాగ్‌రాజ్‌లో తీవ్రస్థాయి సంచలనం అయింది. ఇది రగులుతూ ఉన్న దశలోనే ఇప్పుడు మీరట్‌లో ఈ గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఆదిత్యానాథ్ సిఎం అయ్యాక 183 మంది గ్యాంగ్‌స్టర్ల హతం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టిన 2017 మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో పలు ఎన్‌కౌంటర్లలో 183 మంది గ్యాంగ్‌స్టర్లు హతులు అయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు వర్గాలే గత నెలలో తెలిపాయి. ఈ తరుణంలోనే 13 మంది పోలీసులు కూడా మృతి చెందారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం కల్గిస్తూ కాన్పూర్‌లోని ఓ ఇరుకైన సందులో ఎనమండుగురు పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే అనుచరులు కాల్పులు జరపడం ద్వారా చంపివేశారు, తరువాతి క్రమంలో వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News