గ్యాంగ్‌స్టర్ నయీమ్ కీలక అనుచరుడిగా గుర్తింపు
నేడు నాంపల్లి కోర్టులో హాజరు అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి అనేక అక్రమాలలో భాగస్వామ్యం కలిగి ఉన్న నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 2016లో నయీమ్ హత్యానంతరం శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తెలంగాణ పోలీ సులకు, హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న శేషన్న కో సం పోలీసులు ఎంతో కాలంగా జల్లెడ పడుతున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు రైట్ హ్యాండ్‌గా శేషన్న ఉండేవాడని చెబుతున్నారు. పలుమా ర్లు శేషన్న పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడనే వార్తలు సైతం మీడియాలో చక్కర్లు కొట్టాయి. గ్యాంగ్‌స్టర్ నయీమ్ హత్యానంతరం పో లీసులు నయీమ్ డెన్‌లలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో నయీం అకృత్యాలకు సంబంధించిన డైరీతో పాటు విలువైన ఆస్తులను సైతం స్వాధీనపర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇంతకాలం శేషన్న అజ్ఞాతంలో ఉండడంలో అతడికి సహకారం అందించిందెవరు? అనే దానిపై తదుపరి దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. గ్యాంగ్‌స్టర్ నయీం తర్వాత డెన్‌ను నడపగలిగే సామర్థం శేషన్నకే ఉందని పోలీసు వర్గాలు సైతం అప్పట్లో భావించాయి. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలలో గ్యాంగ్‌స్టర్ నయూం పేరిట అక్రమాలు జరుగుతున్నాయంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ప్రజలను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ల్యాండ్ కబ్జాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడటంలో నయూం కంటే శేషన్నది అందెవేసిన చేయిగా చెబుతారు. ప్లాన్ నయూందయితే ఎగ్జిక్యూటివ్ చేసేది శేషన్నగా చెబుతుంటారు. ఇటీవలి కాలంలో శేషన్న సెటిల్‌మెంట్లతో పాటు భూదందాలకు పాల్పడు న్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు మళ్లీ శేషన్న ఆచూకీ కనుగొనేందుకు మరింతగా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కొత్తపేటలోని ఒక హోటల్‌లో ల్యాండ్ సెటిల్‌మెంట్ చేస్తున్నాడన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్న వద్దనుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, శేషన్నను మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేటకు చెందిన శేషన్న అలియాస్ రామచంద్రుడు పీపుల్స్ వార్‌లో పనిచేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తర్వాత నయిం గ్యాంగ్‌తో కలిసి చాలా సెటిల్‌మెంట్లు చేశాడు.
Gangster Nayeem close associate Sheshanna Arrested