హైదరాబాద్: కరీంనగర్‌లో 350 గ్రానైట్ క్వారీలుంటే తనకు ఉన్నది ఒకటే క్వారీ అని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈటెలకు గంగుల రీకౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఆత్మగౌవరం ఉంటే అసైన్డ్ భూములను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. బిడ్డా అని బెదిరిస్తే అంతకంటే ఎక్కువ మాట్లాడుతానని హెచ్చరించారు. ఈటెల బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. అసైన్డ్ భూములు, దేవాలయాల భూములను తానేప్పుడూ కొనలేదన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ పతనం కావాలని కోరుకున్న వ్యక్తి ఈటెల అని మండిపడ్డారు. అసైన్డ్ భూములు కొన్నట్టు ఈటెల రాజేందర్ స్వయంగా ఒప్పుకున్నాడని, నిజంగా ఆత్మగౌవరం ఉంటే ఎంఎల్‌ఎ పదవికి ఈటెల రాజీనామా చేయాలని సూచించారు. దమ్ముంటే ఈటెల రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని గంగుల సవాలు విసిరారు. కార్యకర్తలను ఈటల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని విరుచుకపడ్డారు. కరీంనగర్ బొందలగడ్డ అయిందన్న మాటలకు ఈటెల సమాధానం చెప్పాలన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు గ్రానైట్ క్వారీలపై ఈటెల ఎందుకు మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఏడేళ్ల కాలంలో ఒక్క గ్రానైట్ క్వారీనైనా ఆపే ప్రయత్నం చేశావా? అని నిలదీశారు. 2023లో టిఆర్ఎస్ రాదని శాపనార్థాలు పెడుతున్నాడని, ఈటెల మాటలు ఆయన అసహనాన్ని తెలియజేస్తున్నాయన్నారు. గెలిచిన అన్ని ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓటర్లు, సీట్లను కొన్నమన్న ఈటెల మాటలు దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజలకు డబ్బులకు అమ్ముడు పోరు అని, ఈటెల సంస్కారం నేర్చుకోవాలని సూచించారు.