హైదరాబాద్ : బిసిల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. తాజాగా 17 నూతన బిసి గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త డిగ్రీ కాలేజీలు మంజూరు చేయడం పట్ల బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని బిసి వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన బిసి గురుకుల డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభానికి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
గతంలో వర్గల్ కాలేజీకి అదనంగా 202223 విద్యా సంవత్సరంలో నూతనంగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకొని తరగతులు ప్రారంభించుకున్నామని, ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలున్నాయని, తాజాగా 17 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడంతో జిల్లాకొకటి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసినట్లయ్యిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిసిలకు నాణ్యమైన విద్యను అందించే లక్షం వైపు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. గత విద్యా సంవత్సరంలోనే నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33 కొత్త గురుకులాలను ప్రారంభించుకున్నామన్నారు.
గత పాలకుల నిర్లక్షంతో వెనక్కు నెట్టేయబడ్డ బిసిల జీవితాల్లో స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో అన్ని రంగాల్లో స్వర్ణయుగం సాధిస్తున్నామన్నారు. గతంలో కేవలం 19 గురుకులాలు, 7 వేల మంది విద్యార్థులకు మాత్రమే గురుకుల విద్య అరకొరగా అందుతుండేదని, కెసిఆర్ ప్రభుత్వం సకల హంగులతో, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో గురుకులాలను దశలవారిగా 261కి, అనంతరం 310కి, నేటి పెంపుతో ఏకంగా 327కు పెంచిందన్నారు. బిసి గురుకులాల్లో ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో చదివిన లక్షా 68 వేల పై చిలుకు బిసి వర్గాల బిడ్డలు నేడు అన్ని పోటీ పరీక్షల్లో తమ సత్తా చాటుతూ తెలంగాణ కీర్తి పతాకను వినువిధుల్లో ఎగిరేయడం సంతోషంగా ఉందన్నారు.
దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో కెసిఆర్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. 250 యూనిట్ల వరకు రజకులకు, నాయిబ్రహ్మణులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా చేతివృత్తుల కులాలను ప్రోత్సహించడం కోసం లక్ష రూపాయల సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.