Monday, January 20, 2025

తొమ్మిది గంటల పాటు ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాసరావు వ్యవహారంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, గాయత్రి రవి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ విచారణ గురువారం రాత్రి దాకా కొనసాగింది. వీరిద్దరినీ సిబిఐ అధికారులు 9 గంటల పాటు విచారించారు. సిబిఐ విచారణ ముగిసిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ పలు అంశాలను ప్రస్తావించారు. సిబిఐ అధికారుల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానని ఆయన తెలిపారు. తనను, గాయత్రి రవిని అధికారులు వేర్వేరుగానే విచారించారన్నారు. విచారణకు మళ్లీ రావాలని తమకేమీ చెప్పలేదని కూడా ఆయన తెలిపారు. నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్‌తో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పామన్న కమలాకర్, అదే విషయాన్ని సిబిఐ అధికారులు రికార్డు చేసుకున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లో నలుగురు వ్యాపారులకు సిబిఐ నోటీసులు…
నకిలీ ఐపిఎస్ అధికారి శ్రీనివాస్ కేసులో మరో నలుగురికి సిబిఐ అధికారులు గురువారం నాడు నోటీసులు జారీ చేశారు. యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచు నాయుడు, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్‌నగర్‌కు చెందిన రవి, మరొకరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ నలుగురూ శుక్రవారమే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ స్పష్టం చేసింది. సిబిఐ బ్రాంచ్ ఢిల్లీలో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీలో పగటి పూట లారీలు తిరిగేందుకు అనుమతులు ఇప్పిస్తానని రవి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇక సిబిఐ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని చెంచు నాయుడిని నమ్మించినట్లు తెలుస్తోంది. వీరంతా శ్రీనివాస్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బంగారు అభరణాలను సైతం ఇచ్చినట్లు తేలింది.

వైజాగ్‌లో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న శ్రీనివాస్ అక్కడ వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడినట్లు సిబిఐ కనిపెట్టింది. దేశ రాజధానిలో మకాం వేసి గత ఐదేళ్లుగా సిబిఐ అధికారినంటూ దందాలు, సెటిల్‌మెంట్‌ల పేరుతో అనేకమంది దగ్గర డబ్బులు దండుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని వారంతా విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే తాము చేసింది అక్రమం కనుక ఎక్కువ మంది చెప్పుకోలేరని అంచనా వేస్తున్నారు. కానీ సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలతో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన వాళ్లు వణికిపోతున్నారు.

Gangula Kamalakar attends to CBI Investigation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News