Monday, January 27, 2025

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గంగుల కమలాకర్: మేయర్ సునీల్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అవినీతికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గంగుల అన్ని అక్రమాలే చేశారని, ప్రతీ విషయం, ప్రతీ తప్పులో గంగుల పాత్ర ఉందని, తన తప్పులు లేవని స్పష్టం చేశారు. చెక్ డ్యాంలను కట్టింది ఇసుక క్వారీలు నడిపింది అన్నిట్లో గంగుల మనుషులేనని, ఒక్కడివే బాగుపడతావా? ఒక్కడివే సంపాధించుకుంటావా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు చేరారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడారు. కరీంనగర్ లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే బిజెపిలో చేరుతున్నానని స్పష్టం చేశారు. చాలా మంది కార్పొరేటర్లు బిజెపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గంగుల మందుతాగించి డిన్నర్ పార్టీలు పెట్టి బతిమాలాడుతున్నా వాళ్లంతా త్వరలోనే బిజెపిలోకి రాబోతున్నరన్నారు.

అడుగడుగునా అవినీతి, ప్రతి పనిలో కమిషన్ తీసుకునే నీచ చరిత్ర కమలాకర్ దని దుయ్యబట్టారు. ‘గంగులా నీ అవినీతిని బయటపెడతా…ఏం పీక్కుంటావో పీక్కో’ అని సవాల్ విసిరారు.  బండి సంజయ్ నిధులు తీసుకొస్తే ఆ సొమ్మును దండుకున్న నీచుడు అని, శ్రీలంక, బ్యాంకాక్ పోయి పత్తాలాడి తందనాలాడే బతుకు గంగులదని సునీల్ రావు విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో బినామీలతోనే అన్ని రకాల కాంట్రాక్టు పనులు చేయిస్తూ దోచుకుంటున్నారని, ఏ టెండర్ వచ్చినా… అందులో ఎంత కమీషన్ వస్తుందన్నదే గంగుల లక్ష్యమన్నారు.

కరీంనగర్ లో జరిగిన ప్రతీ అభివృద్ధిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పాత్ర ఉందన్నారు. తాను నిజాయితీగా పని చేశానని, కరీంనగర్ అభివృద్ధి కోసమే అన్ని భరించానని స్పష్టం చేశారు. ఇక భరించలేకనే పార్టీ మారుతున్నానని ప్రకటించారు. ఇక ముందు ఏ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కు డిపాజిట్ దక్కదని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ నిధులు బండి సంజయ్ తీసుకొచ్చారని వాస్తవాలు చెబితే గంగులకు ఎందుకు కోపం వచ్చిందని సునీల్ రావు ప్రశ్నించారు.  కరీంనగర్ లో ప్రజల సమస్యలను ప్రస్తావించినప్పడల్లా నిధులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అని ప్రశంసించారు. గంగులకు, బండి సంజయ్ కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు.

ఏ షరతు లేకుండా బిజెపిలో చేరుతున్నానని, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని, ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తనకు మేయర్ పదవి రావడానికి ప్రధాన కారణం మాజీ ఎంపి వినోద్ కుమార్ అని, తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నది గంగుల కమలాకరేనని ధ్వజమెత్తారు. అన్ని అవమానాలు దిగమింగుకుని బిఆర్ఎస్ లో 5 ఏళ్లుగా పనిచేశానని వివరణ ఇచ్చారు. బండి సంజయ్ ఏనాడూ పైసలు అడగలేదని, ఏనాడు తనకు ఫలానా పని కావాలని కూడా అడగని క్లీన్ హిస్టరీ బండి సంజయ్ దని సునీల్ రావు కొనియాడారు. బండి సంజయ్ సమక్షంలో మేయర్ తోపాటు ఇద్దరు బిఆర్ఎస్ కార్పొరేటర్లు, పలువురు మాజీ కార్పొరేటర్లు, వందలాది మంది అనుచరులు కాషాయ కండువా కప్పుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News