కరీంనగర్: డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర పౌర సరఫరాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు కేటాయించి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలోనే కొత్తపెల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు విద్యుత్ మీటర్లు, త్రాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కల సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తండ్రి లాంటి వాడని దైవంతో సమానమని, దైవ స్వరూపులని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
కమాన్ పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్.ఎం.డి ముంపుకు దగ్గరగా ఉన్నాయని, వారికి రియాబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని, మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు అర్హులైన వారికి కేటాయిస్తారని చెప్పారు. మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కమాన్ పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఆదివారం కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్తులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి మారాలని ఆయన కోరారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులు ఎవరికి అమ్ముకోరాదని, ఇతరులకు కిరాయికి ఇవ్వరాదని, ఇది చట్టరిత్యా నేరమని లబ్దిదారులు మాత్రమే స్వంత డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించాలని ఆయన కోరారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివారు అధైర్య పడవద్దని అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.
Gangula Kamalakar distribute double houses in Karimnagar