మన తెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డిలో రేషన్ బియ్యంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా ఉంటూ సాధారణ బిజెపి కార్యకర్తగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలపై ఆమె నానా యాగిచేశారని విమర్శించారు. ఇది కేంద్రం పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నిర్మలా సీతారామన్‌పై మంత్రి గంగుల విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా ఆమె కు పలు ప్రశ్నలు సందిస్తూ.. వివరాల్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొ త్తం 90.34 లక్షల కార్డులుంటే కేవలం 59 శాతం కార్డులకు మాత్రమే కేంద్రం బియ్యం ఇస్తోందన్నారు. అది కూడా ఒక్కరికి 5 కిలోలు ఇస్తున్న విషయాన్ని కేంద్రమంత్రికి తెలియకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. వారికి కేంద్రం మూడు రూపాయలు ఇస్తుంటే రెండు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. అదనంగా ఇస్తున్న కిలోకు 33 రూపాయలు వెచ్చించి సాలీనా రూ.372 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలకు కేవలం 1 రూపాయకే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. కేంద్రం పట్టించుకోని అకలితో అలమటిస్తున్న 95 లక్షల మందికి ప్రతి కిలోపై 33 రూపాయలు వెచ్చించి ఎలాంటి పరిమితులు లేకుండా ఇంట్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కడుపునిండా అన్నం పెడుతోందన్నారు. ఇందుకు నెలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంవత్సరానికి రూ.3610 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. అలాగే కరోనా సంక్షోభంలో ఐదు కిలోలు ఉచిత రేషన్ అని కేంద్రం చేతులు దులుపుకుందని మంత్రి గంగుల విమర్శించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 3,863 కోట్లు ఖర్చుచేసి రెండు నెలల పాటు 15 వందల రూపాయలు, వలస కూలీలకు రూ. 500, ప్రతి కార్డుకు కందిపప్పు, చిరుద్యోగులకు మూడు నెలలు 25కిలోల సన్నబియ్యం అందించిన విషయాన్ని గంగుల గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి కార్డుదారునికి మూడువిడతలా 25 నెలల పాటు కేంద్రం ఉచిత ఐదు కిలోలకు తోడు రెగ్యులర్ బియ్యం ఐదుకిలోలు సైతం ఉచితంగా అందించిన తెలంగాణ ప్రభుత్వంతో సరితూగగలరా? అని నిలదీశారు. కలెక్టర్ జిల్లా కార్యనిర్వాహణాధికారి అనే విషయాన్ని కేంద్రమంత్రి మరిచారన్నారు.
Gangula Kamalakar fires on Nirmala Sitharaman