Sunday, December 22, 2024

తరుగు తీస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
చురుగ్గా ధాన్యం కొనుగోలు
గత ఏడాది కంటే 8.69 లక్షల టన్నుల అధికంగా కొనుగోలు
మనతెలంగాణ/హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వచ్చిన తరువాత తాలు పేరుతో తరుగు తీయకూడదని, తేమ తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులుకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమీషనర్ వి.అనిల్‌కుమార్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారి ఆదేశాలు మేరకు తాలు తరుగుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నివేదించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.కొన్ని జిల్లాల్లో ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతికి మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా తక్షణం దించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

రైతులు ఒకేసారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా ఒక క్రమ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం (తేమ శాతం 17 లోపు) ఉండే విధంగా ఆరబెట్టి తాలు లేకుండా తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా కొనుగోలు జరపాలని ఆదేశించారు. లారీలు హామాలీల కొరత లేకుండా కొనుగోలు ప్రక్రియ సాపీగా సాగేలా ధాన్యం కొనుగోలుకు సంబంధం ఉన్న వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాలు తరుగు పేరుతో మిల్లర్లు నుంచి ఎదురవుతున్న సమస్యలతో పాటు ధాన్యం కొనుగోలు, ధాన్యం రవాణా, కనీస మద్ధతు ధర తదితర ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అలాగే హైదరాబాద్‌లోని ఫౌరసరఫరాల భవన్‌లో 1967, 180042500333 టోల్ ఫ్రీ నంబర్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంత్రి కమలాకర్ ఆదేశాల ప్రకారం ధాన్యం అమ్ముకునేందుకు రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుకుగా సాగుతోందని, గత ఏడాది ఇదే సమయానికి 16.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఈ ఏడాది ఇప్పటివరకు 25.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. 8.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసామని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 3.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్ మిల్లులకు కేటాయించడం జరిగిందని కమీషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News