Friday, December 20, 2024

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు..

- Advertisement -
- Advertisement -

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు
అంగరంగ వైభవంగా 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 2న భారీ శోభాయాత్ర
23 నుంచి 4 రోజుల పాటు అధ్యాయం ఉత్సవాలు
కనీవినీ ఎరగని రీతిలో జరగనున్న వేడుకలు:మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరీంనగర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం నగరంలోని టవర్‌సర్కిల్ ప్రధాన మార్కెట్ పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నగర మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మరోభారీ ఆధ్యాత్మిక ఉత్సవానికి కరీంనగర్ సిద్దమవుతోందన్నారు. జనవరి 23 నుంచి అధ్యాయనోత్సవాలు, 4 రోజుల పాటు జరుగుతాయని జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 2న భారీ శోభాయాత్ర జరుపుతామని చెప్పారు.

ఎప్పటిలాగే పద్మశాలి కులస్తులు అమ్మవారికి కళ్యాణం రోజు సారే తీసుకు వస్తారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు నిత్యాన్నదానంతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలలో సేవ చేసుకునే వారు ఆలయకమిటీ సభ్యులకు గానీ, ఈవోకి తమ పేర్లు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. శ్రీవారి కల్యాణం సందర్భంగా కళ్యాణానికి హాజరైన భక్తులకు అమ్మవారి పసుపు, కుంకుమ, అక్షంతలతో పాటు 10 వేల లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, శానిటేషన్ వంటి కార్యక్రమాలు కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతామని వెల్లడించారు. త్వరలో వెంకటేశ్వరస్వామి పాలకవర్గంతో పాటు ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. 27వ తేదీ బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా భారత్ టాకీస్ శ్రీవీరాంజనేయ ఆలయం వద్ద నుంచి పుట్టమన్ను తేవడం జరుగుతుందని సాయంత్రం శేషవాహన సేవ ఉంటుందని వెల్లడించారు. 28వ తేదీ యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, పూర్ణాహుతి, ధ్వజరోహన, సూర్యప్రభ, వాహన సేవ, సాయంత్రం భేరి పూజ, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, చంద్రప్రభ వాహన సేవ ఉంటుందని వెల్లడించారు. 29వ తేదీ ఆదివారం యాగశాలలో నిత్యహోమములు, పూర్ణాహుతి, ఉదయం కల్పవక్ష వాహన సేవ బలిహరణ, తీర్థప్రసాద గోష్టి శివాలయంలో, ఎదురుకోళ్ల ఉత్సవంతో పాటు సాయంత్రం అశ్వవాహన గజవాహన సేవలు ఉంటాయని వెల్లడించారు.

30వ తేదీ సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి లక్ష్మినారాయణస్వామి కళ్యాణోత్సవం, సాయంత్రం గరుడ వాహన సేవ ఉంటుందని వెల్లడించారు. 31వ తేదీ మంగళవారం యాగశాలలో నిత్య పూర్ణాహుతితో పాటు హనుమద్ వాహన సేవ సాయంత్రం సింహ వాహన సేవ ఉంటాయని వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం ఉదయం మహా పూర్ణాహుతితో పాటు చక్రతీర్థం, వసంతోత్సవం, సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ఏకాంత సేవ, పండిత సన్మానం, మహాదాశిర్వాచనం, తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీ గురువారం బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం రాంనగర్ మార్క్‌ఫెడ్ మైదానం నుంచి శోభాయాత్ర ఎన్నడు కనీవినీ ఎరగని రీతిలో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ప్రతి ఏటా తిరుమల తిరుపతిలో జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం తమ అదృష్టమన్నారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో కార్యక్రమం చొప్పున భక్తిభావం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా తొమ్మిది రథాలను సిద్ధం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, నాయకులు చల్లా హరిశంకర్, నందెల్లి మహిపాల్, గంప రమేష్, గోగుల ప్రసాద్, ఆలయ ఈవో, పాలక వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News