ప్రతి ఏడు నూతన బిసి గురుకులాల ఏర్పాటు
పారిశ్రామిక అనుసంధాన కోర్సులు..క్యాంపస్ ప్లేస్‌మెంట్లు
ప్రపంచ స్థాయి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం
సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడు నూతన బిసి గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నూతన గురుకులాల ఏర్పాటుకు సమర్పించాల్సిన ప్రతిపాదనలపై మంత్రి బిసి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నత విద్యావంతుడైనందుననే వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాడన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 281 బిసి గురుకులాలు ఉన్నాయని ఇందులో 143 పాఠశాలలు, 119 పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలు, 19 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయని వీటి ద్వారా 1,52,440 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరిన్ని బిసి గురుకులాలు ఏర్పాటుకు ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం నుంచే జిల్లా యూనిట్‌గా మరో 33 గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి ద్వారా 7,920 మంది బిసి విద్యార్థులకు అదనంగా లబ్ది చేకూరుతుందన్నారు. ప్రతి ఏడూ నూతన బిసి గురుకులాలను పారంభిస్తూ ప్రస్తుతం ఉన్న వాటికి రెట్టింపు చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి మరో 4 స్కూళ్ళను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు వచ్చే సంవత్సరం మరో 115 స్కూళ్ళను అప్‌గ్రేడ్ చేసే దిశంగా చర్యలు చేపట్టాలన్నారు. వీటి ద్వారా 15.600 విద్యార్థులు అదనంగా ఇంటర్ విద్యనభ్యసిస్తారన్నారు. ప్రస్తుతం ఒక మహిళా డిగ్రీ కళాశాల గురుకులాల సంస్థ నిర్వహిస్తోందని అదనంగా 15 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నామన్నారు. వీటి ద్వారా 3600 మంది అత్యున్నత స్థాయి విద్యను ఈ ఏడే అభ్యసించబోతున్నారని తెలిపారు. బిసి సంక్షేమ శాఖ ఏర్పాటు చేయబోయే డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిద్యంగా తీర్చిదిద్దాలని, ఇందు కోసం ఉన్నత విద్యామండలి సహకారం అందించాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఆదేశించారు. డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు సరికొత్త వాటిని ప్రవేశపెట్టాలన్నారు. ఇండస్ట్రీ అవసరాల మేరకు వాటితో అనుసంధానమై కోర్సులను రూపొందించాలని సూచించారు. మెషిన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రీషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ,బిబిఎ, బికాం కంప్యూటర్స్, ఎంపిసిఎస్, ఎంఎస్‌సిఎస్ వంటి కోర్సులను కాలేజీల వారిగా అందజేయాలని సూచించారు. వీటి ద్వారా విద్య పూర్తి చేసుకునే తరుణంలోనే సంక్షేమ శాఖ ద్వారా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు నిర్వహించి అత్యున్నత వేతనాలు అందేలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేపడుతున్నందున రాష్ట్రంలో మరో 21 స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాల కోసం ఇక్కడ శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాలయాలు, హాస్టళ్ళు, గురుకులాలు పునః పారంభమవుతున్నందున ఆయా విద్యాలయాల్లో నిలువ ఉన్న బియ్యాన్ని ఇచ్చి మంచి బియ్యాన్ని పొందాలని నిర్వాహకులను, సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఏ ఒక్కరూ నిర్లక్షంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బిర్రా వెంకటేశం, ఎంజెపి సొసైటి సెక్రటరి మల్లయ్య బట్టు, స్టడీ సర్కిళ్ళ డైరెక్టర్ అకోల్ కుమార్ తదితరులు పాల్గొనానరు.
Gangula Kamalakar review on BC Gurukul Schools