Wednesday, January 22, 2025

ముమ్మరంగా ‘దళిత బంధు’

- Advertisement -
- Advertisement -

Gangula vehicles delivered under Dalit Bandhu scheme

రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలకు యూనిట్ల పంపిణీ

హైదరాబాద్ : ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకంతో దళిత యువత నవశకానికి శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో తొలిసారి హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు వాసాలమర్రి గ్రామంలో దళితబంధు పథకాన్ని అమలు చేశారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వంద మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేశారు. ఇటీవల బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వందలాది దళిత కుటుంబాలకు యూనిట్లు పంపిణీ చేశారు.

దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేసే రూ.10 లక్షలతో ఒక యూనిట్ కాకుండా నాలుగు యూనిట్లు ప్రారంభించేందుకు అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దళిత యువతకు, దళిత కుటుంబాలకు ఈ పథకం వెనుదన్నుగా నిలువనున్నది. ఈ పథకం అమలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి రంగాల్లో కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు శ్రామిక, కార్మిక రంగాల్లో ఉపాధి పొందుతున్న దళిత సమాజం వ్యాపార రంగంలో తన సత్తాను చాటనున్నది. ప్రభుత్వ ఆర్థిక చేయూత, ప్రోత్సాహంతో గ్రామాల్లో పారిశ్రామిక పునాదులను దళిత యువత వేయనున్నది. నైపుణ్యాలే ప్రతిపాదికన లబ్ధిదారుల యూనిట్ల మంజూరుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యమివ్వనున్నారు.

ప్రయోగాత్మకంగా హుజూరాబాద్, నాలుగు మండలాల్లో..

రాష్ట్రంలో తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు చేపట్టారు. నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో 9 లక్షల 90వేల రూపాయల చొప్పున జమ చేశారు. దళితబంధు పథకాన్ని ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుంది. 2021జూలై 17 తేదీన రూ.2 వేల కోట్లను కరీంనగర్ జిల్లా కలెక్టరు ఖాతాలో జమ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోనూ ప్రారంభించారు. ఈ గ్రామంలోని 75 దళిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన చింతకాని, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజక వర్గాలకు చెందిన చారగొండ, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలను దళితబంధు పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసి రూ.250 కోట్లు విడుదల చేశారు.

నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని త్వరితగతిన అమలు చేయడానికి గ్రామ, మండల స్థాయిల్లో కమిటీల ఏర్పాటు చేశారు. దళిత బంధు విశిష్టతలో ఒకసారి 100 % గ్రాంట్ / సబ్సిడీగా దళిత కుటుంబానికి రూ.10 లక్షల అందజేస్తున్నారు. బ్యాంక్ లింకేజీ లేకుండా యూనిట్ మంజూరుతో పాటు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు సొమ్ము జమ చేస్తున్నారు. లబ్ధిదారుల సహకారంతో దళితబంధు రక్షణ నిధిని ఏర్పాటు. ప్రతి లబ్దిదారుకు 10వేల రూపాయలు, ప్రభుత్వం నుంచి సమాన మొత్తంలో సహకారం. గ్రామం, మండలం, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో దళిత బంధు కమిటీల ఏర్పాటు చేసి లబ్దిదారుల నుంచి ప్రాతినిధ్యం అమలును పర్యవేక్షించనున్నారు.

దళిత కుటుంబాల్లో వెలుగులు : కొప్పుల ఈశ్వర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
దళిత బంధు పథకం అమలుతో వేలాది మంది దళిత కుటుంబాలకు మేలు జరిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది బాగుపడుతున్నారు. ‘దళిత సాధికారికత పథకం‘దళితుల జీవితాల్లో కొత్త వెలుగు తేనుంది. కెసిఆర్‌కు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. తరతరాలుగా సామాజిక అసమానతలకు గురైన దళిత సమాజానికి ఆశాదీపంగా దళితబంధు నిలువనున్నది. 75 ఏండ్ల పాలనలో పాలకులు చిన్నాచితక ఎన్నో పథకాలు తెచ్చారు చిత్తశుద్ధి లేనందున గుణాత్మకమైన మార్పు మాత్రం రాలేదు. పథకాన్ని ప్రకటించి బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టారు.‘తెలంగాణ దళితబంధు‘పథకాన్ని తెచ్చారు.ఇదొక విప్లవాత్మకమైన పథకం..

నైపుణ్యానికే ప్రాధాన్యం : బండి శ్రీనివాస్, ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలులో లబ్ధిదారుల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటి వరకు 23,204 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేశాం. వీరిలో 8,400 మంది లబ్ధిదారులు ఇప్పటికే తమ యూనిట్లను ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి మరో 40 వేల మంది ఖాతాల్లో నగదు జమచేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ, ఫౌల్ట్రీ, సెంట్రింగ్, టెంట్ నిర్వహణ, స్థానికంగా డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకుంటే ఉపాధితో పాటు పలువురికి సేవలను అందించే వీలుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News