కోల్కతా: ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుప్రతిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన గంగూలీకి యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. ఈ సందర్భంగా అతనికి రెండు స్టెంట్లను అమర్చారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని అతనికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆఫ్తాబ్ ఖాన్ తెలిపారు. శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్యలు కనిపించలేదని వివరించారు. ఇక త్వరలోనే గంగూలీని డిశ్చార్జ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా కొన్ని రోజుల క్రితమే గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలసిందే. అప్పట్లో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతనికి చికిత్స చేశారు. తాజాగా బుధవారం గంగూలీ మరోసారి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
Ganguly likely to be discharged from hospital soon