గత కొంత కాలం నుంచి తప్పించుకుని తిరుగుతున్న గంజాయి డాన్ అంగూర్‌బాయ్‌ని ఎక్సైజ్
సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ధూల్‌పేటకు చెందిన అంగూర్ బాయి కొన్ని ఏళ్ల నుంచి గంజాయి విక్రయిస్తోంది. నగరంలో గంజాయి ప్రధాన డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. అంగూర్ బాయి వద్దనే నగరంలోని చాలామంది గంజాయి విక్రేతలు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఇలా చాలా ఏళ్ల నుంచి గంజాయి విక్రయిస్తున్న అంగూర్ బాయి కోట్లాది రూపాయలు సంపాదించారు. నిందితురాలిపై నగరంలోని పలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
పదమూడుసార్లు ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేసి జైలుకు పంపించినా బయటికి వచ్చిన తర్వాత గంజాయి దందా చేస్తోంది. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 3, మంగళ్‌హాట్ పిఎస్‌లో 4, ఆసిఫ్‌నగర్, గౌరారం స్టేషన్లలో నమోదైన పది కేసుల్లో ముద్దాయిగా ఉంది. ఇటీవల కాలంలో అంగూర్‌బాయిపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది విస్కృతంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్వాన్ పోలీసులు అరెస్టు చేశారు. అంగూర్ బాయ్ కుటుంబ సభ్యులు పదిమందిపై ఐదు నుంచి పది కేసులు ఉన్నాయి. అంగూర్ బాయ్‌ని అరెస్టు చేసిన ఎస్‌టిఎఫ్ , ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.