సిటిబ్యూరోః నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర స్మగ్లర్లను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 400 కిలోల గంజాయి, డిసిఎం వ్యాన్, కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హన్మకొండకు చెందిన బానోతు వీరన్న, కర్రి శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, పంజా సురయ్య కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.
నిందితులు డిసిఎం వ్యాన్‌లో రహస్యంగా డెస్క్‌ను తయారు చేయించారు. నిందితులు డిసిఎం కంటే ముందు కారులో పైలట్‌గా వస్తుండగా వెనుక డిసిఎం వస్తుంది. పోలీసుల చెకింగ్ ఉంటే వెంటనే డిసిఎం డ్రైవర్‌కు చెబుతారు. ఇలాగే నిందితులు ఆరుసార్లు పోలీసుల కళ్లుగప్పి గంజాయిని రవాణ చేస్తున్నారు. నిందితులు ఎపిలోని కృష్ణదేవి పేటలో గంజాయిని కోనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, రామన్నపేట ఇన్స్‌స్పెక్టర్ మోతిరామ్ తదితరులు పట్టుకున్నారు.