దండకారణ్యంలో రక్తపుటేరులు పారుతున్నాయి. కాల్పుల మోతలతో బస్తర్ అడవులు మార్మోగుతున్నాయి. అబూజ్ మఢ్ కేంద్రంగా రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులను భద్రతా బలగాలు వరుస ఎన్‌కౌంటర్లలో చావుదెబ్బ తీస్తున్నాయి. గత ఏడాదిగా జరుగుతున్న ఎదురుకాల్పుల ఘటనల్లో ఇప్పటివరకు మూడు వందలకు పైగా మావోయిస్టులు హతమైనట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంనుంచీ గత ఇరవై రోజుల్లోనే మూడు ఎన్‌కౌంటర్లలో 44 మందికి పైగా మావోయిస్టులు అసువులు బాశారంటే పోలీసులు ఎంతలా పైచేయి సాధించారో అర్థం చేసుకోవచ్చు.
దండకారణ్యాన్ని చుట్టుముట్టి కాల్పులకు పాల్పడుతున్న సాయుధ బలగాలకు వెరచి గత ఏడాది కాలంలో సుమారు 850 మంది మావోయిస్టులు లొంగిపోగా, పోలీసులు మరో 400 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, సిఆర్‌పిఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ కగార్’ పేరిట సాగిస్తున్న ముప్పేట దాడికి సాంకేతిక పరిజ్ఞానమూ తన వంతు సహకారం అందిస్తూండటంతో మావోయిస్టులు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. కాకులు దూరని కారడవిలో 650కి పైగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని, భద్రతా బలగాలు గాలింపు జరుపుతున్నాయి. మావోయిస్టుల జాడ తెలియగానే విరుచుకుపడి మట్టుబెడుతున్నాయి. అబూజ్ మఢ్ అడవుల్లో మావోయిస్టుల జాడ పసిగట్టడంలో జిల్లా రిజర్వ్ గ్రూపు (డిఆర్‌జి)లదే కీలకపాత్ర. ముల్లును ముల్లుతోనే వెలికి తీయాలన్న ఉద్దేశంతో.. లొంగిపోయిన నక్సలైట్లను ఉపయోగించుకుని, మావోయిస్టుల జాడ కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిందే ఈ డిఆర్‌జి. దట్టమైన అడవిలో ఏది ఎక్కడుందో డిఆర్‌జిలకు కొట్టినపిండి కావడంతో గాలింపు చర్యలలో వారినే ముందుభాగంలో ఉంచుతున్నారు.
ఇప్పటివరకూ జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో డిఆర్‌జిల సహకారం వల్లనే పోలీసులు పైచేయి సాధించారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు నక్సలిజం అనేక రాష్ట్రాల్లో ఊడలూనుకుని, ప్రభుత్వాలను గడగడలాడించిన మాట వాస్తవం. నక్సలైట్లు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, పోలీసులపైన, ఇన్ఫార్మర్లపైన మెరుపుదాడులు జరిపి మట్టుబెడుతూ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. నక్సలైట్ల తుపాకులకు ఎందరో ప్రజాప్రతినిధులు బలైన సంఘటనలు కోకొల్లలు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైతం సాయుధ పోరాట దాడులతో విలవిల్లాడింది. కారణాలేమైతేనేం, ఉభయ తెలుగురాష్ట్రాల్లో నక్సలైట్ల జోరు తగ్గి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. అడపాదడపా భద్రతాదళాలపై గెరిల్లా దాడులు చేస్తూ, మావోయిస్టులు ఉనికిని చాటుకుంటున్నారు. కేంద్రంలో మూడో దఫా అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం మావోయిస్టులను తుడిచిపెట్టేందుకు కంకణం కట్టుకున్నట్లు చత్తీస్‌గఢ్ అడవుల్లో చోటు చేసుకుంటున్న వరుస ఎన్‌కౌంటర్లను బట్టి తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలోగా మావోయిస్టులనుంచి చత్తీస్‌గఢ్‌కు విముక్తి కల్పిస్తామంటూ కేంద్ర హోం మంత్రి చేస్తున్న ప్రకటనలను కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి.
‘దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉంది. నక్సల్స్‌లేని భారత్ దిశగా ఇది ఓ కీలకమైన అడుగు’ అంటూ తాజా ఎన్‌కౌంటర్ అనంతరం హోంమంత్రి ప్రకటించడం గమనార్హం. అయితే జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన ఎదురు కాల్పులేనా అంటే సందేహమే. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినప్పుడు పోలీసుల పక్షాన ఎవరూ గాయపడకపోవడం, మృతులందరూ మావోయిస్టులే కావడం ప్రధానంగా ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల సంఘాలు లేవనెత్తుతున్న అనుమానాలకు సరైన సమాధానాలు లభించడం లేదు. గత నెలలో అబూజ్ మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన సంఘటనపై మానవ హక్కుల కార్యకర్తలు తమ ఆక్రోశం వెలిబుచ్చారు.
ఈ సంఘటనలో చిన్న పిల్లలు కూడా గాయపడ్డారనీ, పొలాల్లో పనిచేసుకుంటున్నవారిని తీసుకువెళ్లి కాల్చి చంపారన్నది వారి అభియోగం. ఆ మధ్య ములుగు జిల్లా ఏటారునాగారం మండలం చెల్పాక వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ సైతం ఇలాంటి అనుమానాలనే రేకెత్తించింది. మావోయిస్టులు తినే భోజనంలో మత్తుపదార్ధాలు కలిపి, వారు స్పృహ కోల్పోయాక కస్టడీలోకి తీసుకుని చిత్రహింసల పాల్జేసి, చంపారంటూ మానవ హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ఇలాంటి సంఘటనలను నిరోధించేందుకు గతంలో సుప్రీం కోర్టుతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా విస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. వాటిని తూచ తప్పకుండా అమలు చేసి ఇలాంటి ఆరోపణలకు అడ్డుకట్ట వేయడం పోలీసుల బాధ్యత.