కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు హామీల అమలుకు నడుం బిగించింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హామీలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత రెండు రోజులుగా హామీల అమలుపైనే కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం ఇప్పటికే అమలులోకి తెచ్చింది. మిగిలిన ఐదింటిలో రూ. 500కే గ్యాస్ సిలిండర్, అర్హత గల మహిళలకు నెలకు రూ. 2500 ఆర్ధిక సహాయం అందించడం.. ఈ రెండు హామీలను ముందుగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. మహిళలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ.2500 ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం—ఈ మూడు హామీలు మహాలక్ష్మి పథకంలో భాగం.
డిసెంబర్ 28నుంచి జనవరి 6వరకూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ రెండు పథకాలకోసమే అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కోసం 91.49 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. మరో 92.23 లక్షల మంది మహిళలు రూ.2500 ఆర్థిక సహాయం కోసం అర్జీలు పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడానికి ముందే ఈ రెండింటినీ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వంద రోజుల్లోగా హామీలను అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ప్రకటించారు.