దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎం.టెక్, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థి సత్తా చాటారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేపర్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన డాక్టర్ సాదినేని నిఖిల్ చౌదరి ఆలిండియా ప్రథమ ర్యాంకుతో మెరిశారు. 100 మార్కులకు గాను 96.33 మార్కులు సాధించారు.
ప్రస్తుతం నోయిడాలోని ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మేటిక్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 1,2,15,16 తేదీలలో ఈ పరీక్షలు జరుగగా ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన ఐఐటీ రూర్కీ అధికారులు బుధవారం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 30 సబ్జెక్టులుక గేట్ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అంచనా. స్కోర్ కార్డులను మార్చి 28 నుంచి మే 31 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచనున్నారు.