Saturday, November 23, 2024

గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వానికి ఖర్గే డిమాండ్
యుఎస్‌లో ముడుపుల కేసు దృష్టా చర్య ఉండాలి

బెంగళూరు : కోటీశ్వరుడైన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ఒక ముడుపుల కేసులో యుఎస్‌లో నిర్ధారిత దోషిగా పేర్కొన్న దృష్టా ఆయనపై వెంటనే చర్య తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదానీని ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం కాపాడుతున్నట్లు ఖర్గే ఆరోపిస్తూ, కాంగ్రెస్ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతుందని, ఆయనపై గల ఆరోపణలపై దర్యాప్తు కోరుతుందని తెలియజేశారు. ఖర్గే బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము పార్లమెంట్‌లో ఈ అంశం లేవనెత్తుతాం, దర్యాప్తు కోరుతాం.

ఆయన (అదానీ) భారత్‌లో ఉన్నందున ఆయనపై చర్య తీసుకోవాలి, ఆయనను అరెస్టు చేయాలి. ప్రభుత్వానికి సర్వం తెలుసు, అందుకే వార అవినీతి కేసుల్లో ఆయనపై సత్వరం చర్య తీసుకోవాలి’ అని అన్నారు. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం సానుకూల షరతులకు మారుగా భారతీయ అధికారులకు 265 మిలియన్ యుఎస్ డాలర్లు (దాదాపు రూ. 2200 కోట్లు) లంచం చెల్లించేందుకు ఒక విస్తృత పథకంలో అదానీకి పాత్ర ఉందని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే, అదానీ గ్రూప్ ఆ ఆరోపణలు అన్నిటినీ ఖండించడమే కాకుండా వాటిని ‘నిరాధారమైనవి’గా అభివర్ణించింది.

కాంగ్రెస్ ఐదు, ఆరు సంవత్సరాలుగా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నదని ఖర్గే చెబుతూ, ‘వారికి (అదానీ, సంస్థకు) అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్నది. కానీ ఆయన గురించి మోడీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు’ అని అన్నారు. ‘హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వద్ద ఇడి, సిబిఐ ఉన్నాయి. అన్ని సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు? క్రితం సారి మేము హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు అది బూటకం అంటూ కొట్టివేశారు’ అని ఖర్గే పేర్కొన్నారు. అదానీ గురించి కాంగ్రెస్ మాట్లాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత చెప్పారు. ‘అయితే, విదేశాల నుంచి కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వారు (యుఎస్) ఆ విషయం స్పష్టంగా చెబుతున్నారు. ఆ ఆరోపణలు తప్పుడివి అయినట్లయితే, వారిపై పరువునష్టం దావా వేయండి. మేము (కాంగ్రెస్) రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నామని మీరు నిందించవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ అదే చెబుతున్నారు హిండెన్‌బర్గ్, అమెరికా&’ అని ఖర్గే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News