Wednesday, January 22, 2025

అదానీ అరెస్టుకు అమెరికా వారెంట్

- Advertisement -
- Advertisement -

సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు కోసం భారత్‌లో రూ.2,238కోట్లు
లంచం ఐదు రాష్ట్రాల అధికారులతో సంబంధాలు
ఒడిశా, తమిళనాడు, చత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్
అధికారులకు ముడుపులు ఎపిలో ‘ఫారిన్ అఫిషియల్#1’కు
ముడుపులు చెల్లించినట్లు అభియోగం అమెరికా
పెట్టుబడుదారులకు అబద్ధాలు చెప్పి నిధులు సేకరించారని
అదానీపై తీవ్ర నేరారోపణలు అమెరికా బ్రూక్లిన్
ఫెడరల్ కోర్టులో కేసు నమోదు అదానీ, అతని మేనల్లుడిపై
అరెస్టు వారెంట్లు జారీ చేసిన న్యాయస్థానం ఆరోపణలు
నిరాధారమని కొట్టిపడేసిన అదానీ గ్రూపు అదానీ
కంపెనీల షేర్లు భారీగా పతనం ఒక్కరోజులో రూ.1.02
లక్షల కోట్ల నష్టం అదానీ కేసులో ప్రధాని నరేంద్రమోడీ
పేరు చేర్చాలని సుబ్రమణ్యస్వామి సంచలన ట్వీట్

భారత బిలియనీర్, అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఇండియాలో సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం పలు రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇవ్వజూపడమే కాకుండా.. దాని గురించి అమెరికన్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి భారీస్థాయిలో నిధుల సమీకరించినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ఆరోపించారు. గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో కేసు నమోదు అయింది.

న్యూఢిల్లీ: అమెరికాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సహా ఏడుగురు వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందడానికి అదానీ భారతీయ అధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచం ఇచ్చారని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం పేర్కొంది. వచ్చే 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల సోలార్ పవర్ ప్లాంట్‌ల కోసం అధికారులకు ఈ లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో న్యూయార్క్ కోర్టులో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.

గత ఏపీ ప్రభుత్వంతో సంబంధాలు
ఈ మోసం కేసులో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జమ్ముకాశ్మీర్, తమిళనాడు వంటి ఐదు ప్రభుత్వ అధికారులకు సంబంధం ఉంది. అయితే 2021 2023 మధ్య కాలంలో అదానీ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో కాంట్రాక్టులను పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారులకు ఈ లంచం ఇచ్చినట్టు ప్రాసిక్యూటర్ ఆరోపించారు. అమెరికా అభియోగాలు మోపిన రాష్ట్రాల్లో ఒడిశా (నవీన్ పట్నాయక్ ప్రభుత్వం), తమిళనాడు (డిఎంకె ప్రభుత్వం), ఛత్తీస్‌గఢ్ (కాంగ్రెస్ ప్రభుత్వం), జమ్మూకాశ్మీర్ (కేంద్ర ప్రభుత్వం) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)కి

12 గిగావాట్ల సోలార్ పవర్‌ను అందించడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ, మరొక పునరుత్పాదక-శక్తి కంపెనీ అజూర్ పవర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం కేసు ప్రధాన అంశంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఇంధనం ఖరీదైనది కావడంతో కస్టమర్లను కనుగొనడంలో ఎస్‌ఇసిఐ కష్టాలు ఎదుర్కొన్నది. ప్రాసిక్యూటర్ల ప్రకారం, అదానీ గ్రూప్, ఈ కంపెనీ సహచరులు కొన్ని రాష్ట్రాలు తమ సౌర శక్తిని ఉపయోగించుకునేలా ఒప్పించేందుకు లంచాలను ఇచ్చారు. అయితే సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లను సేకరించిన అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారులకు ఈ వాస్తవాలను చెప్పకుండా దాచిపెట్టింది. అదానీ గ్రూప్ భారతీయ అధికారులకు సుమారు రూ. 2,238 కోట్లు లంచాలుగా ఇస్తామని హామీ ఇచ్చింది.

7 గిగావాట్ల సౌరశక్తిని కొనుగోలు డీల్
7 గిగావాట్ల సౌరశక్తిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ కంపెనీలతో అదానీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ‘ఫారిన్ అఫీషియల్ #1’ అనే పేరులేని ఒక అధికారికి 228 మిలియన్ డాలర్లు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదానీ 2021లో ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి అనేకసార్లు ఆంధ్రప్రదేశ్‌లోని ‘ఫారిన్ అఫీషియల్ #1’తో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. 2021లో ఆగస్ట్ 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లో అదానీ సదరు అధికారితో భేటీ అయ్యారు. దీని తర్వాత ఆంధ్రా విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాన్ని (పిఎస్‌ఎ) కుదుర్చుకున్నాయి.

7 గిగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించాయి. 2021 జూలై నుండి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో ఇతర రాష్ట్రాలు — ఒడిశా, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు కూడా సోలార్ పవర్ కోసం ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ లంచం కేసులో కుట్రదారులు గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’ లేదా ‘ది బిగ్ మ్యాన్‘ అని కోడ్ పేర్లను ఉపయోగించారని యుఎస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ వ్యవహారం అంతా గోప్యంగా జరిగింది. అదానీ, అతని మేనల్లుడు సాగర్‌కు అమెరికాలో అరెస్ట్ వారెంట్‌లు కూడా జారీ చేశారు. న్యాయవాదులు ఆ వారెంట్లను విదేశీ చట్ట అమలు యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News