Friday, December 20, 2024

‘ఆయారాం.. గయారాం‘కి ఆద్యుడు ఈయనే!

- Advertisement -
- Advertisement -

తరచూ పార్టీలు మారే చట్టసభ సభ్యుల్ని ‘ఆయారాం గయారాం’ అని ఎద్దేవా చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ పదబంధం ఎలా పుట్టిందో తెలుసా? అది తెలుసుకోవాలంటే, మీరీ వార్తా కథనాన్ని చదవాల్సిందే. నిజానికి ఈ ‘ఆయారాం గయారాం’ అనే ఈ మాటలు పుట్టింది హర్యానాలో. ఒకప్పుడు హర్యానా చట్టసభల్లో చాలామంది జంప్ జిలానీలు ఉండేవారు. ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారేవారు. 1966, నవంబర్ 1న పంజాబ్ నుంచి హర్యానా విడివడి… రాష్ట్రంగా ఏర్పాటైంది. 1967లో హర్యానాకు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉండగా, కాంగ్రెస్ 48 స్థానాల్లో, జనసంఘ్ 12 సీట్లలో గెలిచాయి. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇలా గెలిచిన ఇండిపెండెంట్లలో ఒకరు గయాలాల్. ఆయన హోడాల్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి విజయం సాధించారు. ఆ వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు లభించడంతో సహజంగానే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భగవత్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.

అయితే ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో కొనసాగలేదు. పన్నెండుమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో భగవత్ దయాళ్ శర్మ ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయించినవారిలో గయాలాల్ కూడా ఉన్నారు. ఆయన యునైటెడ్ ఫ్రంట్ లో చేరారు. మళ్లీ ఏమైందో ఏమో, మనసు మార్చుకుని, కాంగ్రెస్ లోకి వచ్చేశారు. పోనీ, ఈసారైనా అందులో ఉన్నారా అంటే, లేదు. తొమ్మిది గంటల్లోనే (మీరు చదువుతున్నది నిజమే, తొమ్మిదే తొమ్మిది గంటల్లో) తిరిగి యునైటెడ్ ఫ్రంట్ గ్రూపులో చేరారు. అక్కడ కూడా ఎంతో కాలం లేరు.

కొన్నిరోజుల్లో మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. గయా లాల్ యునైటెడ్ ఫ్రంట్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు, అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి అయిన రాజారావు బీరేంద్ర సింగ్ (ఆ తర్వాత హర్యానా ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు) విలేఖరుల సమావేశానికి గయాలాల్ ను వెంటబెట్టుకుని వచ్చారు. ఆయనను విలేఖరులకు గయాలాల్ ను పరిచయం చేస్తూ ‘గయా రామ్ అబ్ ఆయా రామ్ హై‘ (వెళ్లినవాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు అనే అర్థంలో) అని వ్యాఖ్యానించారు. అంతే… వినడానికీ, అనడానికీ సులువుగా ఉన్న ఈ పదబంధం ఆ తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. హిందీ పదాలే అయినా, అన్ని భాషలవారూ పార్టీలు ఫిరాయించేవారిని ‘ఆయారాం గయారాం‘ అనడం వాడుకలోకి వచ్చింది.

అన్నట్టు… గయాలాల్ పార్టీలు మారడం అంతటితో ఆగలేదు. ఆ తర్వాత కూడా ఆయన తన పద్ధతిని కొనసాగించారు. 1972లో అఖిల భారతీయ ఆర్య సభ తరపున పోటీ చేశారు. 1974లో చౌదరి చరణ్ సింగ్ నాయకత్వంలోని భారతీయ లోక్ దళ్ లో చేరారు. లోక్ దళ్.. జనతా పార్టీలో విలీనమయ్యాక, జనతా పార్టీ టికెట్ పై 1977లో పోటీ చేసి గెలిచారు కూడా. గయా లాల్ 2009లో మరణించారు.

గయాలాల్ తనయుడు ఉదయ్ భాన్ కూడా రాజకీయ నాయకుడే. ప్రస్తుతం ఆయన హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. ఉదయ్ భాన్ కు కూడా పార్టీలు మారే అలవాటున్నా, తండ్రిలాగ మాత్రం కాదు. ఉదయ్ భాన్ 1987లో లోక్ దళ్ పార్టీ టికెట్ పై హసన్ పూర్ నియోజకవర్గంనుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీనుంచి తప్పుకుని, 2000లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై బరిలోకి దిగి, మరొకసారి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలు మారకుండా, కాంగ్రెస్ లోనే కొనసాగుతూ, చివరకు పిసిసి అధ్యక్షుడయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News