Monday, December 23, 2024

గురి తప్పిన యుద్ధం మిగిల్చిన దారుణం

- Advertisement -
- Advertisement -

గాజాస్ట్రిప్ : ఇజ్రాయెల్ హమాస్ బలగాల పరస్పర దాడుల నడుమ గాజాలోని అల్ అహిల్ బాప్టిస్టు హాస్పిటల్‌పై భీకరస్థాయి క్షిపణి దాడి జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడిలో 500 మందికి పైగా చనిపోయ్యారు. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలోని పలు హాళ్లకు మంటలు అంటుకున్నాయి. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుపడ్డారు. ఇజ్రాయెల్ సేనలే ఈ దారుణానికి పాల్పడినట్లు హమాస్ ఆరోపించింది. పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ సేనలు జరుపుతున్న దాడులకు ఇది పరాకాష్ట అని హమాస్ తెలిపింది.

అయితే హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన నాటు క్షిపణి గురి తప్పి ఆసుపత్రిని ధ్వంసం చేసిందని, జరిగిన దారుణానికి హమాస్‌దే బాధ్యత అని ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. తమ ఇంటలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం ఇది పూర్తిగా కేవలం గుడ్డిగా దాడులకు దిగుతోన్న హమాస్ ఉగ్రవాదుల పనే అని ఇజ్రాయెల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. జరిగిన దాడి అత్యంత అమానుషమని పాలస్తీనియా అథార్టీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. వందలాది మంది మృతికి సంతాపంగా గాజాలో 3 రోజుల సంతాప దినం పాటిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

అల్ అహిల్ అరబ్ ఆసుపత్రి దాడి అమానుషం
తీవ్రంగా ఖండించిన ఐరాస నేత
గాజాలోని అల్ అహిల్ అరబ్ ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనను ఐరాస నేతలు, పలు సంస్థలు తీవ్రంగా ఖండించాయి. తాను ఈ దాడి పట్ల దిగ్భ్రాంతికి గురైనట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తమ ప్రకటనలో తెలిపారు. దీనిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల పట్ల ఇది పైశాచిక చర్య అని తెలిపిన ఐరాస అధినేత బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అత్యంత భయానకం, అనాగరికం, క్రూరమని న్యూయార్క్‌లో ప్రకటనలు వెలువడ్డాయి. ఆసుపత్రులు, పౌర సముదాయాలపై ఎటువంటి దాడులు అయినా అంతర్జాతీయ మానవీయ చట్టాలకు, అంతా ఎంచుకునే విలువలకు విరుద్ధం అని,

బాధ్యులను గుర్తించి తగు విధంగా శిక్షించాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు పరస్పరదాడులు జరుగుతున్న ప్రాంతంలో పలువురి ప్రాణాలు , వారి భవిత ప్రశ్నార్థకంగా మారాయని ఐరాస నేత వ్యాఖ్యానించారు. మానవ సంక్షోభ నివారణకు వెంటనే ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ అవసరం అని, ఇది మానవీయ తక్షణ స్పందన అవుతుందని తెలిపారు. వైమానిక దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు 500 మంది చనిపోయినట్లు గాజాలోని హమాస్ ఆధ్వర్యపు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ఇందుకు కారణం అని పేర్కొంది. అయితే ఈ వాదనను ఇజ్రాయెల్ అధికారులు తోసిపుచ్చారు. ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లు గురితప్పి చివరికి గాజాలోని ఆసుపత్రిని తాకాయని తెలిపారు.

ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ పనికాదు
నెతన్యాహుతో అమెరికా అధ్యక్షులు బైడెన్
సెంట్రల్ గాజాలో ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ సేనలు చేసిన దుశ్చర్య అని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షులు బైడెన్ తెలిపారు. ఈ దాడికి పాల్పడింది వేరే బృందం అయి ఉంటుందని, ఇది ఖచ్చితంగా మిలిటెంట్ల చర్యనే అని, తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ విధంగా చేశారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు బైడెన్ తెలిపారు. గాజాస్ట్రిప్ సరిహద్దుల్లోని ఖాన్ యూనిస్ ప్రాంతానికి వచ్చిన బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఆలింగనం చేసుకుని మాట్లాడారు. . ఆసుపత్రిపై దాడి ఘటన మీ పనికాదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఆసుపత్రిపై జరిగిన దాడి తనకు తీవ్ర ఆగ్రహం కల్గించిందని తెలిపిన బైడెన్ హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు పూర్తిస్థాయిలో కొనసాగుతుందని వివరించారు.

ఇందులో వెనుకంజ ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికీ అమెరికా అధ్యక్షులు ఇజ్రాయెల్‌ను వెనుకేసుకురావడం దారుణం అని హమాస్ విమర్శించింది. బైడెన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించడం, గుడ్డిగా నమ్మడం దారుణమని పేర్కొన్న హమాస్ , ఏదో విధంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికే అమెరికా యత్నిస్తోందని తెలిపింది. బైడెన్ పర్యటనకు కొద్ది సేపటి ముందే పాలస్తీనియా రాకెట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. కాగా బుధవారం కూడా గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక , క్షిపణి దాడులు ముమ్మరంగా సాగాయి. ఇప్పటివరకూ పాలస్తీనియన్లకు సురక్షిత ప్రాంతాలని పేర్కొన్న గాజా దక్షిణ ప్రాంతాలపై కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News