Thursday, January 23, 2025

యుద్ధాలకు కారణం అగ్రరాజ్యాలే!

- Advertisement -
- Advertisement -

వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు! తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తున్నాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను బలపరుస్తూ అడ్డం తిరిగిన వాటిని కూల్చేస్తుంటాయి. ఈ విద్యలో ప్రపంచాగ్ర రాజ్యంగా ఆరితేరింది అమెరికా! “ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, పౌర హక్కులను, పవిత్ర ఆశయాలుగా” తమ రాజ్యాంగంలో పొందుపరచుకొన్న అమెరికా, కారుచవకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో మాత్రం తమ చెప్పుచేతల్లో వుండే నియంతలను ప్రోత్సహిస్తూ, అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమాల అణచివేతకు తోడ్పడుతుంది. తాను పెంచి పోషించిన నియంతలు, ఉగ్రవాదులైనా సరే తమకడ్డం తిరిగినప్పుడు తన మీడియా ద్వారా వాళ్ళను భయంకర నియంతలుగా, లోకకంటకులుగా డప్పువేయించి మరీ హతమార్చుతుంది అమెరికా!
1. ఉదా॥ గతంలో అఫ్ఘానిస్తాన్‌నుండి రష్యాను వెళ్ళగొట్టేందుకు బిన్ లాడెన్ నేతృత్వంలోని ఆల్‌ఖైదాను పోషించిన అమెరికా, అది బూమరాంగై తన ‘ట్విన్ టవర్స్’ను కూల్చాక, వేటాడి మరీ బిన్‌లాడెన్‌ను హతమార్చింది! అలాగే ఆయా దేశాల్లో తమ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చడానికైనా సదరు నేతలను హతమార్చడానికైనా వెనుకాడదు అమెరికా!

అందుకు తననడ్డుకునే ఐరాస తీర్మానాలనైనా, మెజారిటీ దేశాల అభ్యంతరాలనైనా, అంతర్జాతీయ న్యాయ స్థానాల తీర్పులనైనా, తన ‘వీటో’ పవర్‌తో జాన్‌దేవ్ అంటుంది అమెరికా! 2. ఉదా॥ ఒక దేశంపై బలప్రయోగానికి, మరో దేశం సొంత నిర్ణయంతోనే కాదు. ఆ దేశపు ప్రతిపక్ష పార్టీ సహాయాన్ని అర్థించినా సరే ఆ దేశంపై సైనిక జోక్యానికి పూనుకోరాదుగాక, పూనుకోరాదు” అని నికరాగువా కేసులో 1986లో తీర్పు నిచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం! 3. ఉదా॥ ‘రక్షించవలసిన బాధ్యత’ అన్న అమెరికా లేదా మిత్రదేశాల సిద్ధాంతాన్ని, సుదీర్ఘ చర్చల అనంతరం ఐరాస జనరల్ అసెంబ్లీ 14 సెప్టెంబర్ 2009 న తిరస్కరించింది! 3. ఉదా॥ ‘మానవ జోక్యపు హక్కు’ అను అమెరికా కూటమి వాదన ఐరాస చట్టాలకు విరుద్ధమంటూ జి 77 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం 29- సెప్టెంబర్ 2009 న తిరస్కరించింది! 4). అలాగే 8 నవంబర్ 2002 న ఇరాక్‌లో అమెరికా జోక్యాన్ని 5). 17 మార్చి 2011న లిబియాలో అమెరికా జోక్యాన్ని తిరస్కరించింది ఐరాస! అయినా సరే తన చమురు దోపిడీని అడ్డుకొంటున్న ఇరాక్ నేత సద్దాం హుస్సేన్‌ను, లిబియా నేత గడాఫీని కిరాతకంగా హతమార్చింది అమెరికా! క్యూబా నేత ఫెడరల్ కాస్ట్రో వగైరా నేతలపై పలు హత్యా ప్రయత్నాలు చేయించింది. “నియంతృత్వ ప్రభుత్వాలు తమ ప్రజలపై దమనకాండను చేస్తుంటే, అంతర్జాతీయ సమాజానికి నివారించే బాధ్యత లేదా” అని దబాయిస్తూ సిరియాలో కొరుకుడు పడని ‘బషర్ అసద్’ ప్రభుత్వ కూల్చివేతకూ సిద్ధమైంది. అమెరికా అరాచకాలలో కొన్ని మాత్రమే ఇవి!

ప్రపంచ చమురు నిక్షేపాల్లో 66% మధ్యధరా ప్రాంతంలోనే వున్నాయి. పాలస్తీనాతో సహా అక్కడున్నవన్నీ అరబ్ దేశాలే! రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మారణకాండ, ఐరోపా దేశాల దాడులతో తల్లడిల్లిన యూదులు, తమ పూర్వుల నివాసమంటూ పాలస్తీనాకు చేరి, అరబ్బుల ఆశ్రయం పొందారు. బ్రిటన్ సహకారంతో పాలస్తీనాలోనే ఒక ప్రక్కన యూదు రాజ్యాన్ని (ఇజ్రాయెల్‌ను) నెలకొల్పుకున్నారు. దేశ దేశాలలో సంపాదించిన ధనరాసులతో అరబ్బుల వేలాది సాగు భూములను కారుచవకగా కొన్నారు. క్రమంగా ఐరాస నిర్దేశించిన సరిహద్దులను కూడా అతిక్రమించి ఐరాస పరిధిలోని జెరూసలేంతో సహా 78% పాలస్తీనాను దురాక్రమించింది ఇజ్రాయెల్. తమకు ఆశ్రయమిచ్చిన లక్షలాది అరబ్బులను పారద్రోలి, చంపి, మిగిలిన వాళ్ళను గాజా, వెస్ట్‌బ్యాక్ పట్టణాలలో కుక్కి, వాళ్ళు బయటకు రాకుండా ‘ఐరన్ డోమ్’ అను స్మార్ట్ కంచెను నిర్మించింది ఇజ్రాయెల్! హమాస్ ఉగ్రవాదులను హతమార్చడమే మా లక్షమంటూ గాజాపై నిర్విరామంగా బాంబుల వర్షం కురిపిస్తున్నది ఇజ్రాయెల్. నాడు హిట్లర్ మారణకాండకు బలైన యూదుల వారసులు నేడు అంతకన్నా కిరాతకంగా అరబ్బులను హతమార్చడం శోచనీయం! ఇప్పటికి 25 వేల మంది చనిపోగా, 65 వేల మంది క్షతగాత్రులయ్యారు.

ఐరాసలో ఇజ్రాయెల్ అమానవీయ మారణకాండను, అమెరికా, దాని మిత్రులు 40 దేశాల వారు సమర్థించినా 153 దేశాలు తీవ్రంగా ఖండించాయి. గాజాపై ఇజ్రాయెల్ దారుణ మారణకాండను, మధ్యంతర ఉత్తర్వుల ద్వారానైనా ఆపించవలసిందిగా దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అభినందనీయం! అయినా సరే ఉగ్రవాదుల నిర్మూలన కోసమే ఇజ్రాయెల్‌ను సమర్థిస్తున్నామంటూ సమర్థించుకొంటున్నది అమెరికా! అదే నిజమైతే 1990లోనే ఐక్యరాజ్య సమితి ‘టెర్రరిస్టు స్టేట్’ గా ప్రకటించిన ఇజ్రాయెల్‌కు ఆర్థిక, ఆయుధ సహాయం ఎందుకు చేస్తున్నది అమెరికా? పైకి ఏం చెప్పినా అరబ్ దేశాల మధ్యలో తమ మిత్రు దేశం ఇజ్రాయెల్ బలపడితే, అది తమ చమురు దోపిడీకి రహదారిగా తోడ్పడుతుందన్నదే అమెరికా ఆంతర్యం!హమాస్ ఉగ్రవాదులను హతమార్చడానికే మా దాడులు అంటున్నా గాజా, వెస్ట్ బ్యాంకులలోని అరబ్బులను హతమార్చి, పారద్రోలి, పాలస్తీనాను సంపూర్ణ యూదు రాజ్యంగా రూపొందించుకోవాలన్నదే ఇజ్రాయెల్ ఆంతర్యం! అమెరికా, ఇజ్రాయెల్ అరాచకాలే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి.

యాసర్ ఆరాఫత్ వగైరాల శాంతియుత పోరాటాలను కూడా అణచివేసింది ఇజ్రాయెల్. ఐరాస, అంతర్జాతీయ న్యాయ స్థానాలు సైతం అసహాయులుగా మారిన నేపథ్యంలోనే తలుపులన్నీ మూసికొట్టబోతే పిల్లే, పులిలా తిరగబడిన విధంగా, పాలస్తీనా విముక్తి కోసం తిరగబడ్డ గెరిల్లా యోధుల బృందమే హమాస్. అట్టి హమాస్ మిలిటెంట్లు 5 వేల మందిని బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నది ఇజ్రాయెల్. వాళ్ళను విడిపించుకునే లక్షంతోనే గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగింది హమాస్! 253 మంది ఇజ్రాయెల్ ఉన్నతాధికారులను బందీలుగా గాజాకు తీసుకెళ్ళి మా మిలిటెంట్లను వదలండి, మీ అధికారులను వదుల్తామని బేరంపెట్టింది హమాస్! అందుకు విభేదించిన ఇజ్రాయెల్ అమెరికా అండతో గాజాపై బాంబుల వర్షం కురిపిస్తూనే వుంది!ఇప్పటి దాకా ‘ఇది పాలస్తీనా సమస్య గదా, మనకెందుకనుకొంటున్న తక్కిన అరబ్ దేశాలకూ జ్ఞానోదయమవుతున్న సంకేతాలు వెలువడుతున్నయ్. 1) ఇజ్రాయెల్ మారణ కాండకు తాళలేక, గాజా, వెస్ట్‌బ్యాంకుల అరబ్బులు కూడా తమ దేశాల నాశ్రయిస్తే,

అది తమకు మరింత భారమవుతుందనీ 2) పాలస్తీనీయులను పారగొడుతున్నా సరే మిన్నకుంటే రేపు తమ దేశాలపై కూడా ఇజ్రాయెల్ దాడికి ఊతమిచ్చినట్లు కాగలదనీ 3) అరబ్ దేశాల మధ్య గల షియా, సున్నీ జాతి వైరాలను కూడా అమెరికా సొమ్ము చేసుకుంటుందని 4) ఇజ్రాయెల్ దూకుడు ఇలాగే కొనసాగనిస్తే అది అరబ్ దేశాలన్నింటికీ ప్రమాదమని 5) టెర్రరిస్ట్ ఇజ్రాయెల్‌ను టెర్రరిజంతోనైనా అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనలు తలెత్తాయి అరబ్బులలో. అందుకే 1) ఎర్ర సముద్రం గుండా వెళ్ళే అమెరికా, దాని మిత్ర దేశాల రవాణా నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీలు నేరుగా ఇజ్రాయెల్ పైన, లెబనాన్‌కు చెందిన హిబ్బుల్లాలు క్షిపణి దాడులకు పూనుకొన్నాయి. 2) సౌదీ, ఇరాన్‌లు తరతరాల జాతి వైరాలను విస్మరించి సత్సంబంధాలను నెలకొల్పుకున్నయి. 3) ఇరాన్ కూడా ఇజ్రాయెల్ నిఘా కేంద్రాల మీద తదనుకూల ఉగ్రవాద శిబిరాల మీద సర్జికల్ దాడులు చేసింది! ప్రతిగా అమెరికా, బ్రిటన్‌లు హౌతీల మీద విమాన దాడులు చేశాయి. ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న భయాన్ని కలిగిస్తున్నాయి.

పై సంఘటనలన్నీ ‘యుద్ధాలకైనా, ఉగ్రవాదులకైనా జన్మస్థలం అగ్ర రాజ్యాల అత్యాశ. అణచివేతలేనని స్పష్టీకరిస్తున్నాయి! అందుకే “మెజారిటీ మతతత్వం, మైనారిటీ మతోన్మాదానికీ మెజారిటీ జాతితత్వం, మైనారిటీ జాతీయ ఉద్యమానికీ బీజం వేస్తాయి!’ అన్నారు దార్శనిక నేత నెహ్రూ. ఈ వాస్తవాన్ని ప్రపంచ దేశాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో సహా భారతీయులంతా సదా గుర్తుంచుకోవాలి. అలాగే “నిరంతర అణచివేత బాధితుల్లో చావు తెగింపుకి బీజం వేస్తుంది! రోజూ చస్తూ బతకడం కన్నా బతకడం కోసం చద్దాం! అన్న తెగింపు బాధిత హృదయాలలో జ్వలిస్తే తద్వారా జరిగే దారుణాలను ఊహంచలేము, నిరోధించలేము!” అన్నారు మరో దార్శనిక నేత కెన్నడీ! అది అక్షర సత్యమనటానికి నిదర్శనాలివే! ప్రపంచంలో కెల్లా మిక్కిలి సమర్థవంతమైన నిఘా వ్యవస్థలను అత్యంత శక్తివంతమైన రక్షణ వలయాలను కలిగి వున్న అమెరికా, నాడు ‘ట్విన్ టవర్స్‌పై’ ఆల్‌ఖైదా దాడిని ఊహించగలిగిందా? నిరోధించగలిగిందా? 2). లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన క్షిపణి నిరోధక ఐరన్ డోమ్‌ను సునిశిత రాడార్ వ్యవస్థను,

అమెరికాకు దీటైన నిఘా వర్గాలను కలిగియున్న ఇజ్రాయెల్, తమ దేశంపై హమాస్ మెరుపు దాడికి దిగుతుందని ఊహించగలిగిందా? నిరోధించగలిగిందా? ప్రపంచంలో అత్యధికులు ఆకలి, అవిద్య, అనారోగ్యాలతో అలమటిస్తున్నారు. అందుకు మూలమైన ఆర్థిక అసమానతలు, వాటిని కొనసాగించడానికి అణచివేతలూ కొనసాగినంత కాలం, యుద్ధాల మారణకాండ, ఉగ్రవాదుల విధ్వంసకాండ కొనసాగుతూనే వుంటాయి” అన్నారు కారల్ మార్క్! కావున అగ్రరాజ్యాధినేతలతో సహా ప్రపంచ దేశాధి నేతలంతా ఆలోచించాల్సింది యుద్ధాల గురించి కాదు, తక్షణం పాలస్తీనాకు విముక్తిని కలిగించే దిశగా ఆలోచించండి! ఆర్థిక అసమానతలను తగ్గించి, ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యాలకు భరోసా కలిగించేందుకు ఆలోచించండి! ఆచరించండి! తద్వారానే ప్రపంచ శాంతి ప్రవర్ధిల్లుతుంది! ప్రపంచాధినేతలారా ఇదే, ఇదే ఇదే సార్వత్రిక సత్యం! “సర్వేజనా స్సుఖినో భవన్తు! విశ్వశాంతిర్భవేత్!”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News