Monday, December 23, 2024

శ్మశానంగా మారిన గాజా అల్ షిఫా ఆస్పత్రి

- Advertisement -
- Advertisement -

179 మందిని సామూహికంగా ఖననం చేసిన ఆస్పత్రి అధికారులు

గాజా: ఇజ్రాయెల్ సేనల ధాటికి గాజా విలవిలలాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో 179 మందిని సామూహిక ఖననం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన అల్‌షిఫా ఆస్పత్రి సూపరింటెండెంట్ మహమ్మద్ అబూ సల్మియా ఆస్పత్రి కాంపౌండ్‌లోనే ఖననం చేసే రీతిలో తమపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.

ఆస్పత్రిలో ఇంధన సరఫరా నిలిచి పోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ఏడుగురు పసికందులు, 29 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని, వారిని అక్కడే ఖననం చేశామని ఆయన చెప్పారు. ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ శవాలు కుళ్లిపోయి దుర్గంధం వ్యాపిస్తోందని, మానవీయ సంక్షోభం తలెత్తుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆస్పత్రి తాజాగా విడుదల చేసిన ఓ చిత్రం హృదయాలను కలచివేసేలా ఉంది. చనిపోయిన ఏడుగురు చిన్నారులను ఒకే కార్పెట్‌లో చుట్టి ఖననం చేస్తున్న దృశ్యం ఆ చిత్రంలో ఉంది.

జనరేటర్లు పని చేయకపోవడంతో తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులు ఇంక్యుబేటర్లలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఎక్కడ చూసినా కుళ్లిపోయిన శవాలే కనిపిస్తున్నాయని ఎఎఫ్‌పి వార్తాసంస్థకు పని చేస్తున్న ఓ జర్నలిస్టు చెప్పారు. పరిస్థితి అమానవీయంగా ఉందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న ఓ డాక్టర్ అన్నారు. ఆస్పత్రిలో విద్యుత్ కానీ నీరు, ఆహారం కానీ లేవని ఆయన చెప్పారు. గత వారం ఇజ్రాయెల్ సైన్యాలు ఆస్పత్రిని చుట్టుముట్టి దిగ్బధం చేసినప్పటినుంచి అల్ షిఫా ఆస్పత్రికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి.ఆస్పత్రి అడుగున హమాస్ ఉగ్రవాదుల సొరంగాలకు కేంద్రంగా అల్ షిఫా ఆస్పత్రి ఉందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది. కాగా అల్ షిఫా ఆస్పత్రి ఓ శ్మశాన వాటికగా తయారైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఆ ఆస్పత్రిలో మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయని కుళ్లిన శవాల కారణంగా దుర్గంధం వస్తోందని పేర్కొంది.

చిన్నారుల ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్!
ఇదిలా ఉండగా సామాన్య పౌరులను, ఆస్పత్రులను తన రక్షణ కవచాలుగా హమాస్ వాడుకుంటోందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా దాన్ని బలపరిచే సాక్షాలను బైటపెట్టింది. గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఐడిఎఫ్ సేనలు హమాస్‌కు చెందిన ఓ సొరంగాన్ని గుర్తించాయి. బుల్లెట్ ప్రూఫ్‌తో పటిష్టంగా ఉన్న ఆ టన్నెల్ ఓ చిన్నారుల ఆస్పత్రికి అనుసంధానంగా ఉండడం గమనార్హం. ఆ ఆస్పత్రి కింద ఉన్న హమాస్ కమాండ్ సెంటర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు బైటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీబియోను ఐడిఎఫ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News